ఆ సీనియర్ కోరిక తీరేదేనా ?

Tue Jul 20 2021 11:41:39 GMT+0530 (IST)

Did that senior wish come true?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తన కోరికను బయటపెట్టారు. అదేమిటయ్యా అంటే దేశంలోని కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ జరగాలట. కమ్యూనిస్టు పార్టీలంటే ఇపుడు అందరికీ తెలిసింది సీపీఐ(ఎం) సీపీఐ మాత్రమే. నిజానికి ఒకపుడు రెండు పార్టీలు కలిసే ఉండేవి. అయితే  సిద్ధాంత పరమైన విభేదాలు రావటంతో కమ్యూనిస్టు పార్టీ కాస్త సీపీఐ(ఎం) సీపీఐగా చీలిపోయాయి.కమ్యూనిస్టు పార్టీ ఒకటిగా ఉన్నపుడు దేశంలోని మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా సమైక్య రాష్ట్రంలో మాత్రం చాల పటిష్టంగానే ఉండేది. విజయవాడ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలను బలంగా నిర్వహించేవి. ఒకదశలో కాంగ్రెస్ ను మించి కమ్యూనిస్టు పార్టీకే జనాలు బాగా ఆధరణ చూపారు. కాలక్రమంలో దేశం మొత్తంమీద  రెండు పార్టీలు జనాదరణను కోల్పోయాయి.

సీపీఎం అన్నా చాలా కాలంపాటు పశ్చిమబెంగాల్ త్రిపురలో అధికారంలో ఉండేది. కేరళలో అధికార-ప్రతిపక్షాల్లో కూర్చుంటుండేది. ఇపుడు వరుసగా రెండోసారి కేరళలో సీపీఎం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సీపీఐని అయితే దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా పట్టించుకునే వాళ్ళేలేరు. ఒకపుడు వామపక్షాలంటే ప్రజా సమస్యలపై ప్రజలకోసమే పోరాటాలు చేసేవి.

కానీ ఇపుడు తామె చెబుతున్న బూర్జువా పార్టీలతో పొత్తులు పెట్టుకుని దెబ్బ తినేశాయి. దాంతో వామపక్షాల నుండి పోరాటాలు ఉద్యమాలు లాఠీదెబ్బలను ఎవరు ఆశించటంలేదు. ఇలాంటి నేపధ్యంలోనే దేశంలోని  కోట్లాది కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ఉభయ కమ్యూనిస్టుపార్టీలు ఏకం కావాలనే కోరికను రామకృష్ణ బయటపెట్టారు. ఆమధ్య ఒకసారి రెండు పార్టీలు ఏకం కావాలనే ప్రతిపాదన వచ్చినా ఎందుకనో మళ్ళీ వినిపించలేదు.

ఇంతకాలానికి రామకృష్ణ మళ్ళీ అదే ప్రతిపాదన వినిపించారు. మరీసారి ఏమవుతుందో చూడాల్సిందే. సీపీఐ జాతీయ కార్యదర్శిగా డాక్టర్ కే. నారాయణ ఉన్నారు. అలాగే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారం ఏచూరి ఉన్నారు. ఇద్దరు తెలుగు వాళ్ళే కాబట్టి నిజంగానే పునరేకీకరణకు వీళ్ళు చిత్తశుద్దితో ప్రయత్నిస్తే మిగిలిన నేతలు సానుకూలంగా స్పందిస్తారేమో చూడాలి.