చెన్నైలో ట్యాంకర్ నీళ్లు రేటెంతో తెలుసా?

Tue Jul 16 2019 07:00:01 GMT+0530 (IST)

రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల్లో ట్యాంకర్ నీళ్ల బాధ తెలిసిన వారు హైదరాబాదీయులే.నగరంలో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా నూటికి 75 శాతం మంది ఏడాదిలో ఏదో సమయంలో ట్యాంకర్ నీళ్ల మీద ఆధారపడాల్సిందే. గత ఏడాది వర్షాలు సరిగా పడకపోవటం.. ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగా ఉండటంతో ట్యాంకర్ల డిమాండ్ అంతకంతకూ పెరిగిపోయింది.ఇదెంత వరకూ వెళ్లిందంటే.. పది వేల లీటర్ల ట్యాంకర్ నీళ్ల ధర రూ. మూడు వేల వరకూ చేరుకుంది. విచిత్రమైన విషయం ఏమంటే.. జనవరిలో కూడా ఇదే ట్యాంకర్ ధర రూ.1500 మాత్రమే. కానీ.. హైదరాబాద్ లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవటంతో  దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాటర్ వర్క్స్ సప్లై చేసే నీళ్లు సైతం అరకొరగా సరఫరా చేస్తుండటంతో ఇబ్బందికర పరిస్థితులున్నాయి.

జనవరితో పోలిస్తే జూన్ నాటికి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీనికే ఇలా ఉంటే.. చెన్నైలో నీళ్ల కొరత మరింత ఎక్కువగా ఉంది. నీళ్ల సదుపాయం తగ్గిపోవటంతో చాలా హోటళ్లు తమ మెనూలో నుంచి మీల్స్ సెక్షన్ ను ఎత్తేశారు. కేవలం టిఫిన్లను మాత్రమే వండుతున్నారు. చాలా ఆఫీసులు తమ ఉద్యోగుల్ని ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వర్తించమని కోరుతున్నాయి. ఇదిలాఉంటే.. తాజాగా నీళ్ల కొరతను అధిగమించేందుకు రైళ్లల్లో  ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. చెన్నైలో ట్యాంకర్ల ధరలు చుక్కల్ని అంటుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం పది వేల లీటర్ల నీటి ట్యాంకర్ రూ. 6 వేల నుంచి రూ.9 వేల వరకూ నడుస్తుందని చెబుతున్నారు. మరింత షాకింగ్ విషయం ఏమంటే.. సదరు నీళ్ల ట్యాంకర్లు సరాసరిన వంద కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి తీసుకొస్తున్నాయట. సాధారణంగా వాటర్ ట్యాంకర్ నీళ్ల కోసం ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపే తీసుకొస్తుంటారు. అందుకు భిన్నంగా వంద కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను తెస్తున్న కారణంగా రోజుకు వేసే ట్యాంకర్ల ట్రిప్పులు బాగా తగ్గిపోతున్నట్లు చెబుతున్నారు. నీళ్ల కొరత కారణంగా ప్రస్తుతం హోటళ్లు మాత్రమే కాదు.. ఆసుపత్రులు కూడా తమ ఛార్జీల్ని భారీగా పెంచేసినట్లు చెబుతున్నారు. భారీగా వర్షాలు పడితే తప్పించి చెన్నై వాసులకు పట్టిన నీటి శని వదలదని చెబుతున్నారు.