ఏపీ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫైల్ పై గవర్నర్ కొర్రీ పెట్టారా?

Mon Jun 14 2021 13:00:01 GMT+0530 (IST)

Did Governor Query put on the AP nominated MLC file?

ఖాళీగా ఉన్న ఏపీ ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నాలుగు పేర్లను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు పంపిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వెళ్లినంతనే.. గవర్నర్ ఆ ఫైల్ కు ఓకే చెప్పటం రివాజుగా వస్తోంది. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితి తాజాగా ఉందని చెబుతున్నారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీని ఎంపిక చేసేందుకు కొద్ది రోజుల క్రితం నాలుగు పేర్లను (అప్పిరెడ్డి తోట త్రిమూర్తులు మోషేన్ రాజు రమేశ్ యాదవ్) రాజ్ భవన్ కు పంపటం తెలిసిందే.రోటీన్ కు భిన్నంగా తాజా ఫైల్ ను గవర్నర్ పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం పంపిన నాలుగు పేర్లలో రెండింటిపైనా గవర్నర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  లేళ్ల అప్పిరెడ్డి.. తోట త్రిమూర్తుల పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా గవర్నర్ కు ఫిర్యాదులు అందటంతో వారి పేర్లపై కొర్రీ పెట్టినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైలు పక్కన పెట్టినట్లుగాతెలుస్తోంది. గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యే వారు వివాదరహితులై ఉండటంతో పాటు.. ఎట్టి పరిస్థితుల్లో నేర చరితులుగా ఉండకూడదన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే ఫైల్ ను వెంటనే ఓకే చేసి పంపకుండా.. కాస్త ఆపినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి శని.. ఆదివారాల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫైల్ మీద సంతకం పెడతారన్న అంచనాలు వినిపించాయి. అందులో భాగంగా సోమవారం ప్రమాణస్వీకారానికి కొందరు నేతలు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలుకే ఎసరు అన్నట్లుగా పంపిన పేర్లపై గవర్నర్ లేవెనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పటంతో పాటు కొర్రీని క్లియర్ చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. గవర్నర్ తో ఈ రోజు భేటీ కానున్నారు. మరి.. గవర్నర్ ను జగన్ ఒప్పస్తారా? గవర్నర్ అభ్యంతరాల్ని సీఎం జగన్ ఏకీభవిస్తూ తన నిర్ణయంలో మార్పులు చేసుకుంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.