Begin typing your search above and press return to search.

ఆ పెద్దాయనకు పాజిటివ్.. కేసీఆర్.. జగన్ కు ఐసోలేషన్ అవసరమా?

By:  Tupaki Desk   |   25 Nov 2021 10:31 AM GMT
ఆ పెద్దాయనకు పాజిటివ్.. కేసీఆర్.. జగన్ కు ఐసోలేషన్ అవసరమా?
X
సరిగ్గా నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనమరాలి పెళ్లి అత్యంత వైభవంగా శంషాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో జరిగింది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా హాజరు కావటం ఈ పెళ్లి వేడుకకు మరింత శోభగా మారింది. గడిచిన కొద్ది నెలలుగా కనీసం ఫోన్లో మాట్లాడుకోవటానికి ఇష్టపడని ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఆ వివాహ వేడుకలో పక్కపక్క కూర్చోవటంతో పాటు.. కాసేపు మాట్లాడుకున్నారు.కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పెళ్లి పెద్ద పోచారం వారి వెంటనే ఉన్నారు. వారికి అవసరమైనవన్నీ తన వారితోకలిసి తానే సొంతంగా చూసుకున్నారు.

కట్ చేస్తే.. తాజాగా ఆయన కాసింత అనారోగ్యంగా అనిపించటంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు పరీక్షలు జరిపిన వైద్యులు.. కరోనా పాజిటివ్ అని తేల్చారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలినా.. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవటంతో కాసింత ఊరట కలిగించే అంశం. కాకుంటే..ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న రెండు తెలుగురాష్ట్రాల సీఎంల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

గతంలో కేసీఆర్ కు కొవిడ్ రావటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఈ మధ్యనే ఆయన ప్రస్తావించటం.. కొన్ని గోళీలు వేసుకున్నంతనే తగ్గిందని.. తాను ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదని చెప్పటం జరిగింది. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి విషయానికి వస్తే.. ఇంతకాలం కొవిడ్ కు దూరంగా ఉండగలిగారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దాని బారిన పడకుండా ఉన్నారు.

అలాంటి జగన్.. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి పాజిటివ్ అయిన వేళ.. అంతో ఇంతో ముప్పు ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు తీసుకున్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఒక వారం అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటారా? పోచారం పాజిటివ్ ను పెద్దగా పట్టించుకోరా? అన్నది తేలాల్సి ఉంది.