Begin typing your search above and press return to search.

ఈ పరీక్షతో నాలుగేళ్ల ముందే కేన్సర్ నిర్ధారణ

By:  Tupaki Desk   |   3 Aug 2020 11:10 AM GMT
ఈ పరీక్షతో నాలుగేళ్ల ముందే కేన్సర్ నిర్ధారణ
X
కేన్సర్....ఈ మహమ్మారి సోకి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాతపడుతున్నారు. కేన్సర్ బారిన పడి చికిత్స చేయించుకునే స్థోమత లేక చాలామంది మరణిస్తుంటే....డబ్బులున్నా కేన్సర్ ను గుర్తించడంలో జాప్యం వల్ల స్థోమత ఉండీ కొంత మంది తనువు చాలిస్తున్నారు. కేన్సర్ సోకినప్పటికీ....ఆ వ్యాధి లక్షణాలు బయటపడనంతవరకు దానిని గుర్తించడం కష్టం. ఆ రకంగా ఈ వ్యాధి బారినపడి ఎంతో మంది అర్ధంతరంగా ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నారు. అయితే, ఇకపై అటువంటి మరణాలను నివారించే అవకాశముందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కేన్సర్ సోకి ఆ లక్షణాలు కనిపించనివారిని బ్రతికించవచ్చని చెబుతున్నారు. ఇకపై కేన్సర్ వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయట పడేందుకు ఇంకా సమయం ఉండగానే కేన్సర్ సోకినట్లు గుర్తించవచ్చని అంటున్నారు. ఈ తరహా కేసుల్లో `పాన్ సీర్` అనే రక్త పరీక్ష ద్వారా కనీసం నాలుగేళ్లు ముందుగానే కేన్సర్ సోకినట్లు గుర్తించే విధానాన్ని కనిపెట్టామని చెబుతున్నారు.

కేన్సర్ మహమ్మారి సోకి లక్షణాలు కనిపించకున్నా....ఆ వ్యాధి సోకినట్లు కనీసం నాలుగేళ్ల ముందే గుర్తించే టెక్నాలజీని అభివృద్ధి చేశామని చైనీస్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ‘పాన్‌సీర్‌’ పేరుతో సరికొత్త లిక్విడ్‌ బయాప్సీ పద్ధతిని అభివృద్ధి చేశామని, ఈ రక్త పరీక్షతో కనీసం ఐదు రకాల కేన్సర్లను లక్షణాలు కనిపించేందుకు నాలుగేళ్ల ముందే గుర్తించవచ్చునని అంటున్నారు. అయితే, ఇది కేన్సర్‌ ను ముందుగానే గుర్తించే పరీక్ష కాదని, వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయటపడేందుకు ఇంకా సమయం ఉండగానే వ్యాధి సోకినట్లు తెలుసుకునేందుకు చేసే పరీక్ష అని చెప్పారు. కేన్సర్‌ కణితుల డీఎన్‌ఏలో తరచూ కనిపించే మిథైల్‌ గ్రూపులను ఈ రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తామని, అత్యంత సూక్ష్మస్థాయి డీఎన్‌ఏ మిథైల్‌ గ్రూపులను కూడా గుర్తించగలమని చెప్పారు. మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీల ద్వారా దీనిని నిర్ధారిస్తామని చెప్పారు.

చైనాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 414 మంది రక్తపు ప్లాస్మాను తమ పరిశోధనల కోసం 2014 కంటే ముందు సేకరించామన్నారు. పాన్‌సీర్‌ పరీక్ష కేన్సర్‌ ఉన్న వారిని 88% వరకు గుర్తించిందని తెలిపారు. ఈ విషయంపై మరింత లోతైన పరిశోధనలు జరుపుతున్నామని చెప్పారు. కేన్సర్ ను గుర్తించేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న `లిక్విడ్‌ బయాప్సీ` ద్వారా వెలువడే ఫలితాలలో కచ్చితత్వం కన్నా పాన్ సీర్ ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని వారు చెబుతున్నారు.