Begin typing your search above and press return to search.

దమ్ము తగ్గిన ధోని.. మరో మూడేళ్లా?

By:  Tupaki Desk   |   27 Nov 2021 1:30 PM GMT
దమ్ము తగ్గిన ధోని.. మరో మూడేళ్లా?
X
టీమిండియా ఆటగాడిగా, సారథిగా మహేంద్ర సింగ్ ధోనిది తిరుగులేని కెరీర్. ఒక విధంగా చెప్పాలంటే.. ధోని రంజీల్లో కూడా అంత గొప్పగా రాణించకున్నా, టీమిండియా లోకి వచ్చాక దుమ్ము రేపాడు. అసలు భారత క్రికెట్ జట్టు స్వరూపాన్నే మార్చేశాడు. కొన్ని దశాబ్దాలుగా మ్యాచ్ లను ఎలా ముగించాలో తెలియక, గెలుపు వాకిట బోర్లాపడుతున్న టీమిండియాకు తన సామర్థ్యంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు.ఒకటా రెండా ? ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో ముగించిన ఘనత మహీది.

ఐపీఎల్ లోనూ విజయవంతమైన సారథి

2008లో మొదలైన ఐపీఎల్ లో చెన్పై సూపర్ కింగ్స్ పగ్గాలందుకున్నాడు ధోని. అప్పటి నుంచి అతడే కెప్టెన్. మరో మాటే లేదు. ఆటగాళ్లు ఎందరు మారినా.. మరెందరో రిటైరైనా ధోనీ నాయకత్వానికి ఢోకా లేదు. అదేంటో గాని సాధారణ ఆటగాడు ధోని జట్టులోకి వచ్చేసరికి సూపర్ స్టార్ అవుతాడు. ఫామ్ కోల్పోయి మహీ కింద ఆడితే ఫేమస్ అవుతాడు. అసలు కెరీరే ముగిసిందనుకున్నవాడు ధోని కెప్టెన్సీలో చేరితే తిరిగి పుంజుకుంటాడు. తెలుగు తేజం అంబటి రాయుడు నుంచి రుతురాజ్ గైక్వాడ్ వరకు ఇందుకు ఎన్నెన్నో ఉదాహరణలు.

వయసు పెరిగింది.. సత్తా తగ్గింది

ఎవరెన్ని చెప్పినా, ధోని లో కొన్నాళ్లుగా సత్గా తగ్గింది అన్నది మాత్రం వాస్తవం. ఇటీవలి ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. 40 ఏళ్ల ధోని, కొన్ని మ్యాచ్ లలో భారీ షాట్లు ఆడలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా దుబాయ్ పిచ్ లపై అతడికి పరుగులు చేయడమే కష్టమైపోయింది. అయితే, కెప్టెన్సీ పరంగా చురుకైన వ్యూహాలతో తనకు తిరుగులేదని అనిపించుకున్నాడు. ఎప్పటిలాగే అతడి సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంలో ఆడిన కుర్రాళ్లు టైటి్ల్ కొట్టేశారు.

సీఎస్ కే పగ్గాలు ఇంకో మూడేళ్లు అతడికేనా?

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై నెటిజన్లు మాత్రం గుర్రుగా ఉన్నారు. చాలా మంది CSK చర్యను ‘ఆత్మహత్య’ గా అభివర్ణిస్తున్నారు. మరికొందరు మూడు సంవత్సరాలు కాకుండా కేవలం ఒక సంవత్సరం పాటు సారథిగా ఉంచుకోవాలని ఫ్రాంచైజీని కోరతూ ట్వీట్లు చేస్తున్నారు. ధోనికి 40 ఏళ్లు నిండిపోయాయని, మరో మూడు సీజన్‌లకు సారథిగా ఉంచుకోవడం పెద్ద తప్పు అని భావిస్తున్నారు.

మూడు సంవత్సరాలు ఎందుకు భయ్యా.. వచ్చే ఏడాదికి మాత్రమే ఆయనను సారథిగా ఉంచండంటూ నెటిజన్లు సీఎస్‌కేను ఏకిపారేస్తున్నారు.