కుప్పం లో ఎన్టీఆర్ అభిమానుల ధర్నా

Mon Nov 29 2021 11:01:06 GMT+0530 (IST)

Dharna of NTR fans in Kuppam

తెలుగుదేశం పార్టీ- జూనియర్ ఎన్టీయార్ అభిమానుల మధ్య నిప్పు రాజుకుంటోంది. టీడీపీ నేతలు కొందరు జూనియర్ ఎన్టీయార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జూనియర్ ఎన్టీయార్ అభిమానులు కుప్పంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అసెంబ్లీలో భువనేశ్వరిపై వైసీపీ ఎంఎల్ఏలు అనుచితంగా మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యల పై నందమూరి కుటుంబంతో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకుని గట్టిగా మాట్లాడారు. ఇందులో భాగంగానే జూనియర్ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు.

అయితే ఆ వీడియో లో భువనేశ్వరి పేరు కానీ చంద్రబాబు పేరు కానీ లేదు. ఇంతే కాకుండా జగన్మోహన్ రెడ్డికి వార్నింగులు గట్రా కూడా ఏమీలేకుండానే జస్ట్ ఘటనను ఖండిస్తూ జూనియర్ వీడియో వదిలారు.

దాంతో ఒళ్ళు మండి పోయిన తమ్ముళ్ళు జూనియర్ పై రెచ్చి పోయారు. ముఖ్యంగా వర్ల రామయ్య బుద్ధా వెంకన్న లాంటి వారు జూనియర్ వీడియోను ఎగతాళి చేశారు. తాము అనుకున్న పద్దతి లో స్పందన లేక పోవటంతో జూనియర్ ను మీడియా సమావేశంలోనే ఎగతాళి చేశారు.

దీని పైనే తాజాగా జూనియర్ ఎన్టీయార్ అభిమానులు పెద్ద ఎత్తున కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్ల బుద్ధాలకు అభిమానులు గట్టి వార్నింగే ఇచ్చారు. ఇంకో సారి జూనియర్  పై నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదంటు గట్టి గానే హెచ్చరించారు.

తమ అభిమాన నటుడు జూనియర్ పై టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను సహించేది లేదని అభిమాన సంఘం అధ్యక్షుడు శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. సరే ఇలాంటి వార్నింగులు ఇవ్వటం మామూలే.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే మొన్నటి వరకు చంద్రబాబునాయుడు కంచుకోటని చెప్పుకునే కుప్పంలోనే జూనియన్ ఎన్టీయార్ అభిమానులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. మొదటి నుండి జూనియర్ ను టీడీపీలోకి తీసుకురావాలనే డిమాండ్లు కుప్పంలోనే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

చంద్రబాబు పర్యటనలో కూడా బాహాటంగానే జూనియర్ కు మద్దతుగా అభిమానులు డిమాండ్లు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా కుప్పంలో మాత్రమే జూనియర్ ఎన్టీయార్ అభిమానులు మద్దతుదారులు ఎందుకింతగా యాక్టివ్ గా ఉన్నారో అర్ధం కావటంలేదు. మొన్నటి కుప్పం మున్సిపల్ ఎన్నికలకు రెండు రోజుల ముందుకూడా టీడీపీకి ఓట్లేయద్దని జూనియర్ ఎన్టీయార్ అభిమానుల పేరుతో రిలీజైన బహిరంగ లేఖ సంచలనమైంది.

పార్టీకి జూనియర్ ను దూరం చేసేస్తున్నారంటు అభిమానులు కుప్పంలో మొదటినుండి గోల చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేనంతగా జూనియర్ అభిమానులు కుప్పంలో మాత్రమే ఎందుకింత యాక్టివ్ గా ఉన్నారో అర్ధం కావటంలేదు.

దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? ఎవరైనా వారిని నడిపిస్తున్నారా? అన్నది తెలియడం లేదు.