వైసీపీ ఏలుబడిలో ఎమ్మెల్యేల కధలు వ్యధలు వేరేగానే ఉంటున్నాయి. ఎందుకంటే అక్కడ ట్రెడిషనల్ పాలిటిక్స్ అన్నది కనిపించడంలేదు. ముఖ్యమంత్రిని కలవాలి అంటే వారికి ఎంత పెద్ద కష్టమో అంటారు. ఈ విషయంలో వారూ వీరూ అన్న తేడా లేదు అందరి బాధా ఒక్కటే. జగన్ని కలుద్దామని ప్రయత్నించే వారు కూడా ఇక తమ వల్ల కాదు అని విరమించుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయట.
విషయానికి వస్తే
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
కూడా ఇలా బాధితుడే అంటున్నారు. ఆయన తన బాధను అంతా మీడియా సమావేశాలు పెట్టి
చెప్పుకుంటున్నారు. అయితే ఆయన ఏకంగా కొన్ని విషయాల మీద ప్రభుత్వం దృష్టికి
నేరుగా జగన్ దృష్టికి తెద్దామని అనుకుంటే జగన్ అపాయింట్మెంట్ అసలు
దొరకలేదుట.
ఒకసారి కాదు నాలుగు సార్లు ఆయన జగన్ తో భేటీకి
అపాయింట్మెంట్ అడిగినా ఆయనకు దర్శనభాగ్యం కలగలేదుట. లేటుగా ఈ విషయం బయటకు
వచ్చినా లేటెస్ట్ టాపిక్ అయింది మరి. ఇంతకీ ధర్మాన ఈ విషయాన్ని ఎవరితో
చెప్పకూడదో వారికే చెప్పారు. అంతే ఇది బాగానే వైరల్ అవుతోంది. ఈ మధ్యనే
విశాఖ జిల్లా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక చానల్ లో ఇంటర్వ్యూలో
మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల గురించి ప్రస్థావన వచ్చింది.
తాను
ఆ మధ్య ఒక ప్రైవేట్ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ
మంత్రిని కలిశానని ప్రభుత్వం చేసే తప్పుల గురించి ఆయనతో చెప్పి మీ లాంటి
వారు అయినా సరిదిద్దేందుకు ప్రయత్నం చేయరా అని అడిగానని అయ్యన్న చెప్పారు.
దానికి
ఆ మాజీ మంత్రి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం తాను నాలుగు సార్లు
ప్రయత్నించినా దొరకలేదు అని వాపోయారట. ఆ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావే కదూ
అంటూ ఇంటర్వ్యూ చేసిన వారు అడిగితే అవును అని అయ్యన్న బదులిచ్చారు.
అంటే
ధర్మాన ఎంతలా హర్ట్ అయ్యారు అన్నదే ఇక్కడ విషయం మరి. ధర్మాన చిన్న నాయకుడు
ఏమీ కాదు 1989లోనే తొలిసారి ఎమ్మెల్యే అయి ఆ టెర్మ్ లోనే ఇద్దరు
ముఖ్యమంత్రుల వద్ద మంత్రి పదవులు నిర్వహించిన వారు. ఇక వైఎస్సార్
క్యాబినేట్లో కూడా కీలకంగా వ్యవహరించారు. రెవిన్యూ వంటి శాఖలను కూడా ఆయన
చూసిన నైపుణ్యం ఉన్న వారు.
మరి ఆయనకే అపాయింట్మెంట్ దొరకలేదా అన్న
చర్చ అయితే అటు సొంత పార్టీలోనూ ఇటు బయట రాజకీయాల్లోనూ జోరుగా సాగుతోంది.
మరి ఈ తరహా బాధితులు మరెంతమంది ఉన్నారో అన్నదే అందరి మాటగా ఉంది.
మొత్తానికి వైసీపీలో ఏం జరుగుతుందో సీనియర్లకే అర్ధం కావడం లేదు అన్న
కామెంట్స్ అయితే గట్టిగా పడుతున్నాయి.