Begin typing your search above and press return to search.

రౌండ్ టేబుల్ పాలిటిక్స్ : ధర్మాన సౌండ్ వినబడలేదేంటి....?

By:  Tupaki Desk   |   26 Sep 2022 1:30 PM GMT
రౌండ్ టేబుల్ పాలిటిక్స్ : ధర్మాన సౌండ్ వినబడలేదేంటి....?
X
విశాఖలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ జనాలు అంతా కలసి ఆర్భాటంగా నిర్వహించిన అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశంలో కీలకమైన మంత్రి ధర్మాన ప్రసాదరావు కనిపించలేదు, ఆయన మాట వినిపించలేదు. మరో వైపు ఈ మీటింగ్ మొత్తాన్ని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ హైజాక్ చేసి పారేశారు అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పార్టీ మీటింగ్ కాదంటూనే వైసీపీ వారే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మొత్తానికి మొత్తం వచ్చిన వారు కూడా వారే. జగన్ దృష్టిలో ఫోకస్ కావడానికి ఆయన మెప్పు పొందడానికే ఈ మీటింగ్ అని కూడా ప్రత్యర్ధి పార్టీల నేతలు అంటున్నారు. ఇక ఈ మీటింగ్ ని బొత్స శిష్యుడిగా అంతా భావించే విశాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ నేతృత్వంలో నిర్వహించారు. అయితే తెర వెనక డైరెక్షన్ అంతా బొత్సదే అని అంటున్నారు.

ఇక బొత్స ఈ మీటింగులో పాల్గొని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్రా వాయిస్ అంటే తానే అన్నట్లుగా ఆయన హడావుడి చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నా ఉత్తరాంధ్రా అంటే కేవలం విశాఖ విజయనగరం జిల్లాలేనా అన్న చర్చ వస్తోంది. శ్రీకాకుళం వారికి ఈ మీటింగులో ఏ మాత్రం అయినా పాల్గొనాలని సమాచారం ఇచ్చారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ మీటింగ్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తప్ప అంతా పాలుపంచుకున్నారు.

మరి ఉత్తరాంధ్రా వాణిని బలంగా వినిపించాలని మీటింగ్ పెట్టినపుడు అత్యంత వెనక బడిన శ్రీకాకుళం జిల్లాను ఎందుకు విస్మరించారు అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఒకవేళ పిలిచినా అక్కడ నుంచి ఎవరూ రాలేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు వంటి మాటకారి, విషయ పరిజ్ఞానం బాగా ఉన్న వారు రౌండ్ టేబిల్ మీటింగ్ లో ఉంటే బయట జనాలకు మంచి సందేశం వెళ్లేది అన్న మాట కూడా వినిపిస్తోంది.

ఆయన సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉన్న వారు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏమైనా సొంత పార్టీలోనే రాజకీయాలు చోటు చేసుకున్నాయా ధర్మాన హైలెట్ అవుతారని ఆయనను అలా సైడ్ చేశారా అన్న చర్చ వస్తోంది. ఉత్తరాంధ్రా అంటే బొత్స అన్న ఫోకస్ ఉండాలనే ఇలా చేశారా ఇది రాజధాని కోసం మీటింగా లేక రాజకీయాల కోసం మీటింగా అన్న ప్రశ్నలు కూడా కొందరు వేస్తున్నారు.

బొత్స సత్యనారాయణకు ధర్మానకు మధ్య కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయని చెబుతారు. ఇద్దరూ సీనియర్ లీడర్లే. అయితే గట్టిగా చెప్పుకోవాలీ అంటే ధర్మానే కాంగ్రెస్ లో ముందుగా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి కూడా చేపట్టారు. వైసీపీలో చూసుకుంటే బొత్స ముందు చేరారు, ధర్మాన తరువాత వచ్చారు. దాంతో బొత్సకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బొత్సకు ఆయన సామాజికవర్గం పరంగా పట్టు ఉండాంతో ఆయన్ని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా కూడా జగన్ నియమించారు. దాంతో పాటు అయిదేళ్ల మంత్రిగా ఆయన జగన్ క్యాబినేట్ లో ఉన్నారు.

ఇవన్నీ కలసి బొత్స సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉత్తరాంధ్రా ఐకాన్ గా కనిపించాలన్నగట్టి ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా బొత్స అటు శ్రీకాకుళం, ఇటు విశాఖ రాజకీయాల్లో కూడా తనకంటూ పట్టు సాధించడంతో ఆయన ఈ తరహా మీటింగుల పేరిట తానుగా హైలైట్ కావాలనుకుంటున్నారా అన్న చర్చ అయితే పార్టీలో నడుస్తోంది. మొత్తానికి ధర్మాన సౌండ్ వినిపించకపోవడం చిత్రమే అంటున్నారు. అయితే శ్రీకాకుళంలో కూడా ఈ తరహా రౌండ్ టేబిల్ మీటింగ్ ఒకటి పెడతారు అని అంటున్నారు. చూడాలి మరి అపుడు బొత్స ధర్మానలో ఎవరు హైలైట్ అవుతారో అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.