Begin typing your search above and press return to search.

దేవినేని తొంద‌ర‌ప‌డుతున్నావేమో..కాస్త చూసుకో!

By:  Tupaki Desk   |   17 April 2019 8:46 AM GMT
దేవినేని తొంద‌ర‌ప‌డుతున్నావేమో..కాస్త చూసుకో!
X
విడి రోజుల్లో రాజ‌కీయ విమ‌ర్శ‌లు పెద్ద విష‌యం కాదు. ఒక‌రిని ఒక‌రు ఉద్దేశించుకొని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసుకోవటం మామూలు. త‌మ‌కున్న స‌త్తా మేర‌కు ఎదుటోళ్ల‌నుఉద్దేశించి నాలుగు మాట‌లు అనేయ‌టం త‌ప్పేం కాదు. కానీ.. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ ముగిసి.. ప్ర‌జ‌లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేసిన వేళ‌.. తొంద‌ర‌పాటుతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టంలో అర్థం లేదు.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. ప్ర‌జ‌లు తీర్పును ఇచ్చేశారు. అలాంట‌ప్పుడు ఆ తీర‌పు వెలువ‌డే వ‌ర‌కూ ఓపిగ్గా వెయిట్ చేయ‌టం మంచిది. తాను చెబుతున్న‌ట్లుగా ఫ‌లితం వ‌స్తే.. అప్పుడైనా ఇంతే ఘాటుగా తిట్టొచ్చు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా.. ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న భావ‌న‌తో నోరు పారేసుకోవ‌టం అంత మంచిది కాద‌న్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట‌లు అనేస్తే.. రేపొద్దున తేడా ఫ‌లితం వ‌స్తే ప్ర‌జ‌ల్లో అయ్యే చుల‌క‌న మామూలుగా ఉండ‌దు. ఇలాంటి విష‌యాల్ని మంత్రి దేవినేని లాంటోళ్లు మ‌ర్చిపోతారో ఏమో?

తాజాగా జ‌గ‌న్ ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అవ‌స‌రానికి మించిన‌ట్లుగా ఉన్నాయ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తుది ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తాయ‌న్న‌ట్లుగా భావించి.. నోటికి ప‌ని చెబుతున్న దేవినేని.. వాతావ‌ర‌ణం అలా లేద‌న్న విష‌యాన్ని ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఎవ‌రైనా గెల‌వొచ్చు. ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కూ ఆగి.. త‌ర్వాత ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే ఎవ‌రేం అనుకోరు క‌దా? అన్న మాట వినిపిస్తోంది. తాజాగా దేవినేని మాట‌ల్ని చూస్తే.. జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని.. ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూసి త‌ట్టుకునేందుకు జ‌గ‌న్ సిద్ధంగా లేర‌న్నారు. ఫైన‌ల్ పేమెంట్ తీసుకున్న ప్ర‌శాంత్ కిశోర్ జ‌గ‌న్ చేతిలో సీఎం నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లార‌న్నారు. జ‌గ‌న్ త‌న ఓట‌మిని పోలింగ్ జ‌రిగిన సాయంత్ర‌మే అంగీక‌రించార‌న‌నారు. కౌంటింగ్ వ‌ర‌కూ క్యాడ‌ర్ ను కాపాడుకునేందుకుజ‌గ‌న్ అనేక తంటాలు పడుతున్న‌ట్లు చెబుతున్న దేవినేని.. చొక్కాలు చించుకునే సంస్కృతి జ‌గ‌న్ దేన‌న్నారు.

స్పీక‌ర్ పై దాడి చేసింది కాక‌.. గ‌వ‌ర్న‌ర్ కు అన్ని అబ‌ద్ధాలు చెప్పార‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఓటు వేసిన మ‌రుక్ష‌ణం ప‌క్క రాష్ట్రానికి జ‌గ‌న్ పారిపోయార‌ని.. తాము త్వ‌ర‌గా పోవాలంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌న్నారు. వ‌చ్చేది మ‌ళ్లీ తెలుగుదేశం ప్ర‌భుత్వ‌మేన‌ని.. జ‌గ‌న్ వెళ్లేది చంచ‌లాగూడ‌.. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకా అన్న‌ది తేల్చుకోవాలంటూ మండిప‌డ్డారు. దేవినేని మిస్ అవుతున్న లాజిక్ ఏమిటంటే.. ఇవే మాట‌లు మ‌క్కీకి మ‌క్కీ జ‌గ‌న్ పార్టీ నేత‌లు అనే అవ‌కాశం ఉంద‌ని.. కానీ.. ఫ‌లితాల వెల్ల‌డికి ముందు ఇంత హ‌డావుడిగా మాట‌లు అనేసుకోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు.