ఎల్ఏసి వద్ద భారీగా బలగాల మోహరింపు .. అధునాతన యుద్ధ సామాగ్రిని తరలించిన సైన్యం

Fri Oct 22 2021 20:00:01 GMT+0530 (IST)

Deployment Of Heavy Forces At LAC Army

చైనా తో పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సరిహద్దుల్లో సైనికశక్తిని భారత్ మరింత పటిష్ఠం చేసింది. భారత్-చైనా సరిహద్దు అయిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వద్ద ఇరు వర్గాలు బలగాలను మోహరిస్తున్నాయి. మానవహిత విమానాలు అత్యాధునిక హోవిట్జర్లు ఆధునీకరించిన బోఫోర్స్ తుపాకులను సరిహద్దులకు భారత్ తరలించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో LAC పరిధిలో నిఘా సామర్ధ్యాన్ని పెంచుకోవడంపై భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. సరిహద్దు భద్రతలో భాగంగా మానవరహిత నిఘా వాహనాలతో పాటు దేశీయంగా అభివృద్ధిపరచిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మోహరిస్తోంది.అంతే కాదు ఈ ప్రాంతంలో రోడ్లు బ్రిడ్జిలు ఎయిర్ బేసులు సొరంగాల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరుస్తూ ఆవాసాలకు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. శత్రువులకు చెందిన డ్రోన్లు లేదా హెలికాప్టర్టు లేదా తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను పడగొట్టేందుకు LACకి అత్యంత సమీపంలో ఆధునీకరించిన L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ ను మోహరించింది. 1960 నుంచి వాయు రక్షణలో ప్రధానంగా ఎయిర్ డిఫెన్స్ గన్స్ కు స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడించిన వాటిని ఆధునిక ఆయుధాలుగా తీర్చిదిద్దడం జరిగిందని సైనికాధికారులు చెబుతున్నారు.

ఆధునీకరణతో లక్ష్యాన్ని మెరుగ్గా అంచనా వేయగలగడం ఆటోమ్యాటిక్ టార్గెట్ ట్రాకింగ్ సామర్ధ్యంతో పాటు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వాటిని నవీకరించారు. వీటిలో ఇప్పుడు హై-రెజల్యూషన్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సర్లు డే లైట్ టెలివిజన్ కెమెరాలు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు లేజర్ రేంజ్ ఫైండర్స్ వెలాసిటీ రాడర్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వారసత్వ ఆయుధాలను అత్యాధునిక ఎయిర్ డిపెన్స్ ఆయుధ వ్యవస్థగా మార్చామని ఎయిర్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఆధునిక గన్ సిస్టమ్ తో ఆధునీకరించిన L-70 గన్స్ సరితూగుతాయి. ఈ గన్స్ కు ఫ్లైక్యాచర్ రాడర్ వ్యవస్థ కూడా ఉంది.

ప్యాంగంగ్ సరస్సు సమీపంలో గతేడాది మే 5న భారత్ చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో సరిహద్దు ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ సంఘటన తర్వాత రెండు దేశాలు సరిహద్దుల వెంబడి వేలాది మంది సైనికులను భారీ ఆయుధాలను మోహరించాయి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య అనేక దఫాలు చర్చలు జరిగినా పెద్దగా ఫలితం రాలేదు.ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  లో దాదాపు 300 గన్స్ ఆధునీకరించే పని దాదాపు చివరి దశకు వచ్చింది. అలాగే 1980లో భారత సైన్యంలో చేరిన స్వీడన్ తయారీ బోఫొర్స్ గన్స్ LAC లోని మారుమూల ప్రాంతాల్లో మోహరించారు. ఈ గన్స్‌ను ఇప్పుడు శక్తి సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ చేశారు. వీటికి అదనంగా మూడు రెజిమెంట్ల ఆధునిక M777 ఆల్ట్రాలైట్ హోవిట్జర్లను కూడా LAC దగ్గర మోహరించారు. ఒక్కొక్కటి 4200 కేజీల బరువు ఉండే ఈ ఫిరంగులను పర్వత శిఖరాలపై నుంచి ఉపయోగించేలా తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం చివరి నాటికి సైన్యానికి 145 హోవిట్జర్లు అందుతాయని తెలుస్తోంది.