Begin typing your search above and press return to search.

తెలుగు ప్రజల గుండెల్లో వాన దడ..మరో 4 రోజులు భారీ వర్షాలేనట

By:  Tupaki Desk   |   19 Oct 2020 3:00 PM GMT
తెలుగు ప్రజల గుండెల్లో వాన దడ..మరో 4 రోజులు భారీ వర్షాలేనట
X
వాన అంటే ఆశగా చూసే తెలుగు ప్రజలకు.. ఇప్పుడు మాకొద్దు బాబోయ్ అనేంతలా వరుణుడు విసిగిస్తున్నాడు. ఈ సీజన్ లో ఊహించిన దాని కంటే భారీగా వర్షాలు పడటం.. తక్కువ సమయంలో పడుతున్న కుండపోతతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భారీగా హైదరాబాద్ మహానగరం వరద మాటున చిక్కుకుంది. వందలాది కాలనీలు జలమయం కావటం ఒక ఎత్తు అయితే.. దెబ్బ మీద దెబ్బ అన్న రీతిలో రెండు రోజుల తేడాతో కురిసిన భారీ వర్షాలతో లక్షలాది మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఒక్క హైదరాబాద్ మహానగరంలో 15వేలకు పైగా ఇళ్లు..నీట మునిగి ఉండటం చూస్తే..వాన తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు. విపత్తు విరుచుకుపడిన వేళ.. ఏం చేయాలో తోచక చేష్టలుడిగిపోయిన ప్రజలపై వరుణుడు మళ్లీ కత్తికట్టినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. రానున్న నాలుగురోజుల్లో పే..ద్ద పరీక్షనే తెలుగు ప్రజలు ఎదుర్కోనున్నట్లుగా వాతావరణ శాఖ చెబుతోంది.

ఇప్పటికే కురిసిన వాన.. దాంతో ఏర్పడిన వరద నుంచి కోలుకోక ముందే.. మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉందన్న వర్షం ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం.. పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితలం ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు (సోమవారం) ఉదయానికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఏపీ తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఈ రెండింటి ప్రభావంతో అటు ఏపీ.. ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు వాన ప్రభావానికి లోను కానున్నాయి. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం మంగళవారం నుంచి గురువారం వరకు.. అంటే మూడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో తాజాగా చోటు చేసుకున్న మార్పులతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంది. గంటకు 45 కి.మీ. నుంచి 55కి.మీ. మధ్యలో వేగంగా గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాతావరణ హెచ్చరిక తెలుగు ప్రజలు గుండెల్లో కొత్త భయాన్ని పుట్టించటం ఖాయం.