కూతురికి ఉరి వేసి.. తాను ప్రాణాలు తీసుకున్న డెంటిస్టు.. ఎందుకలా అంటే?

Sat Aug 13 2022 10:08:00 GMT+0530 (IST)

Dentist Killed Her Daughter and Suicide Herself

కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన డెంటిస్టు ఆత్మహత్య ఉదంతం వెనుకున్న అసలు కారణాన్ని పోలీసులు గుర్తించారు. తన చిన్నారి కుమార్తెకు ఉరి వేసి.. తాను బలవ్మరణానికి పాల్పడిన ఉదంతం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన పోలీసులు వారిద్దరి మరణాల వెనుక ఉన్న అసలు విషయాన్ని గుర్తించారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే డెంటిస్టు శైమా.. ఆమె కుమార్తెల మరణాలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వారి విచారణలో ఇదే విషయాలు వెలుగు చూసినట్లుగా వారు వెల్లడించారు.

కొడుగు జిల్లా విరాజపేటకు చెందిన శైమా బీడీఎస్ పూర్తి చేశారు. డెంటిస్టుగా కెరీర్ షురూ చేశారు. బీడీఎస్ చేసే వేళలో పరిచయమై.. తర్వాత ప్రేమగా మారిన తన సహరుడు నారాయణన్ ను పెళ్లి చేసుకున్నారు.

ఈ ప్రేమ పెళ్లి తర్వాత ఆమె తన ఇంటికి వెళ్లలేదు. వీరి కాపురం బాగా సాగుతున్న వేళలో.. శైమా తల్లి.. తన కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకోవటంతో తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు.

ఆ దిగులు భరించలేక ఆమె ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె పుట్టింటి వారు శైమాను ఇంటికి రానివ్వలేదు. తల్లి ఆత్మహత్య నేపథ్యంలో శైమా తీవ్రంగా కలతకు గురైనట్లుగా చెబుతున్నారు.

తల్లి బలవ్మరణం తర్వాత నుంచి ఆమె పుట్టింటి వారు ఆమెతో మాట్లాడటం మానేశారు. దీంతో..తన పరిస్థితికి తీవ్రమైన విరక్తికి గురైన శైమా.. తన చిన్నారి కుమార్తెకు ఉరి వేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం కర్నాటకలో సంచలనంతో పాటు.. పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. వారి మరణాల వెనుక అసలు కారణం ఇదేనంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.