Begin typing your search above and press return to search.

చైనాకు చేరిన డెల్టా.. అక్క‌డి ప‌రిస్థితి ఏంటో తెలుసా..?

By:  Tupaki Desk   |   29 July 2021 3:36 PM GMT
చైనాకు చేరిన డెల్టా.. అక్క‌డి ప‌రిస్థితి ఏంటో తెలుసా..?
X
బూమ‌రాంగ్ అంటే తెలుసా? ఎక్క‌డి నుంచైతే విసిరారో.. తిరిగి అక్క‌డికే చేరుకునే ఒక చిన్న వ‌స్తువు అది. ఇప్పుడు చైనా విష‌యంలో క‌రోనా స‌రిగ్గా బూమ‌రాంగ్ లా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైరస్ ఎన్ని వేరియంట్లుగా మారిపోయిందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే.. అందులో కొన్ని మాత్ర‌మే డేంజ‌ర్ గా మారాయి. అలాంటి వాటిల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది డెల్టా వేరియంట్‌.

నిజానికి చైనా నుంచి బ‌య‌ల్దేరిన క‌రోనాకు.. ఇప్పుడు ప్రపంచంలో మ‌నుగ‌డ‌లో ఉన్న క‌రోనాకు అస‌లు పోలిక‌లే లేవు. ఎన్నో విధాలుగా రూపాంత‌రం చెందింది. ఇందులో బ్రెజిల్ లో వెలుగుచూసిన (P.1), సౌతాఫ్రికాలో గుర్తించిన‌ (B.1.351), బ్రిట‌న్ లో రూపాంత‌రం చెందిన‌(B.1.1.7)తోపాటు భార‌త్ లో వెలుగు చూసిన (B.1.617) వేరియంట్లు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. అయితే.. వీట‌న్నింటిలో భార‌త్ లో గుర్తించిన B.1.617 వేరియంట్ ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన అన్ని ర‌కాల మ్యుటెంట్ల క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని నిపుణులు నిర్ధారించారు.

అయితే.. ఇందులోనూ మ‌రో మూడు ర‌కాలు వెలుగులోకి వ‌చ్చాయి. అవి.. B.1.617.1, B.1.617.2, B.1.617.3గా ఉన్నాయి. అయితే.. ఇందులో B.1.617.2 ర‌కం చాలా బ‌లంగా ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణులు చెబుతున్నారు. భార‌త్ లో సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విజృంభించ‌డానికి కూడా ఈ వేరియంటే కార‌ణ‌మ‌ని భావిస్తోంది. భార‌త్ లో దాదాపు 12 వేల‌కు పైగా వేరియంట్స్ ను గుర్తించ‌గా.. ఇవే అత్యంత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన‌ట్టు నిపుణులు నిర్ధారించారు. డెల్టా, డెల్టా ప్ల‌స్ గా చెప్పే ఈ వేరియంట్ ప్ర‌స్తుతం వంద‌కు పైగా దేశాల‌ను చుట్టేసింది.

ఈ మ‌ధ్య‌నే పుట్టినిల్లు చైనాను చేరింది. ఈ డెల్టా దెబ్బ‌కు డ్రాగ‌న్ దేశం అత‌లాకుత‌లం అవుతోంది. పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో.. ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప‌లు ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తోంది. టెస్టుల సంఖ్య కూడా పెంచుతోంది. అంతేకాకుండా.. వ్యాక్సిన్ విష‌యంలోనూ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతోందని స‌మాచారం. జ‌నాల‌కు మూడో డోస్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది? అనే విష‌య‌మై ఆలోచ‌న‌లు చేస్తోంది. మ‌రి, ఈ డెల్టా చైనాపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో చూడాలి.