అమెరికాకు బయలుదేరిన విమానంలోని ఒక ప్రయాణికుడు మరణించాడు. దీంతో మూడు గంటలు ప్రయాణించిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-105 విమానం ఢిల్లీ నుంచి నెవార్క్ కు టేకాఫ్ అయ్యి మూడు గంటలకు పైగా ప్రయాణించింది.
అయితే భార్యతోపాటు అందులో ప్రయాణించిన అమెరికా
జాతీయుడు విమానం ఆకాశంలో ఉండగా చనిపోయాడు. దీంతో ఆ విమానాన్ని వెంటనే
వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.
ఎయిర్
ఇండియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఎయిర్ ఇండియా ఢిల్లీ-నెవార్క్
(యూఎస్) విమానం మూడు గంటలకు పైగా ప్రయాణించిన తర్వాత అత్యవసర వైద్య
పరిస్థితి కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు
తెలిపారు.
ఎయిర్ పోర్టులోని వైద్యులు విమానంలోకి వచ్చి ఆ వ్యక్తి
చనిపోయినట్లు నిర్ధారించారని చెప్పారు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు పోలీసులకు
చెప్పినట్లు వెల్లడించారు.
కాగా.. విమాన టైమ్ డ్యూటీ లిమిటేషన్
(ఎఫ్.డీ.టీఎల్) నిబంధనల ప్రకారం విమాన కార్యకలాపాల కోసం మరొక బ్యాచ్
సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. కొత్త
సిబ్బందితో అదే విమానం సాయంత్రం 4 గంటలకు అమెరికాకు బయలుదేరుతుందని
పేర్కొన్నారు.