Begin typing your search above and press return to search.

తబ్లిగీ జమాత్ లాంటివి దేశంలో చాలానే ఉన్నాయా?

By:  Tupaki Desk   |   2 April 2020 7:50 AM GMT
తబ్లిగీ జమాత్ లాంటివి దేశంలో చాలానే ఉన్నాయా?
X
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం.. ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండటం. బయటకు రాకపోవటం. మరి.. అందుకు భిన్నంగా బయటకు వస్తే? సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటే? సదస్సులు నిర్వహిస్తే? ఆ దినం.. ఈ దినం అంటూ ప్రోగ్రామ్ లు నిర్వహిస్తే.. ఇప్పుడున్న పరిస్థితి లాంటివే చోటు చేసుకుంటాయి. ఇవాల్టి రోజున దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నిజాముద్దీన్ లో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సదస్సుగా చెప్పక తప్పదు.

దీంతో.. అసలు ఆ సదస్సును ఎలా నిర్వహిస్తారు? దానికి అనుమతి ఎవరు ఇచ్చారు? లాంటి ప్రశ్నల్ని చాలామంది సంధిస్తున్నారు. ఇలా సీరియస్ గా ప్రశ్నించేవారంతా తబ్లిగీ జమాత్ లాంటివి చాలానే చోటు చేసుకున్నాయని.. అలాంటి వాటి మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారు. లాక్ డౌన్ ను పట్టించుకోకుండా.. కరోనా ముప్పును తక్కువగా అంచనా వేస్తూ.. నిర్వహించిన కార్యక్రమాలకు కొదవ లేదంటున్నారు. ఎక్కడి దాకానో ఎందుకు? రాష్ట్రపతి భవన్ లో మహిళా దినోత్సవం వేళ ప్రభావశీలురైన మహిళలకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటికే ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నది మర్చిపోకూడదు.

ఇవాల్టి రోజున కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. కరోనా విరుచుకుపడటానికి కాస్త ముందు.. ఆ రాష్ట్రంలో అటుకుల్ పొంగల్ పండుగను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది నుంచి పది రోజుల పాటు నిర్వహించారు. ఇది కూడా ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణంగా చెబుతారు. దేశ ప్రధాని మోడీ స్వయంగా టీవీ తెర మీదకు వచ్చి.. జాతిని ఉద్దేశించిన ప్రసంగించి ఇరవై ఒక్కరోజుల పాటు దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన పక్కరోజునే.. యూపీ సీఎం.. మోడీ మాష్టారికి అత్యంత విదేయుడైన యోగి ఆదిత్యనాథ్.. అయోధ్యలో రామ నవమి ఉత్సవాల్ని నిర్వహించారు. దీనికి పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

అంతేనా? మార్చి 10- 12 మధ్య పంజాబ్ లో సిక్కుల మత సమావేశాన్ని నిర్వహించారు. అందులో ప్రసంగించిన డెబ్భై ఏళ్ల ప్రచారకుడు కరోనా కారణంగా మరణించటం సంచలనంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. కరోనా స్టార్ట్ అయిన తర్వాత..పెద్ద కార్యక్రమాల్ని చాలానే నిర్వహించినట్లుగా చెప్పక తప్పదు. మరిప్పుడు కూడా తబ్లిగ్ జమాతే నిర్వహించిన కార్యక్రమాన్నే భూతద్దంలో పెట్టి చూద్దామా?