Begin typing your search above and press return to search.

దిశా రవి కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..ఏం సాక్ష్యముందో చూపండి!

By:  Tupaki Desk   |   22 Feb 2021 8:20 AM GMT
దిశా రవి కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..ఏం సాక్ష్యముందో చూపండి!
X
రైతులను ఆందోళనల భాట పట్టడానికి, ఖలిస్థాన్ వేర్పాటువాదులతో కలసి టూల్ కిట్ ను తయారు చేయడంతో దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన దిశా రవి బెయిల్ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లో భారత పరువును తీసే ప్రయత్నం ఆమె చేశారని, రైతుల ఆందోళనలను అడ్డుపెట్టుకుని దేశంలో అశాంతి రేపాలని చూశారని కూడా పోలీసులు పలు ఆరోపణలు చేయగా , తనకు సాక్ష్యాలను చూపాలని న్యాయమూర్తి కోరారు.

అంతకుముందు దిశా రవికి బెయిల్ మంజూరు చేయవద్దని వాదించిన ప్రాసిక్యూషన్, టూల్ కిట్ తయారీ వెనకున్న ఆమె అమాయకురాలేమీ కాదని, కావాలనే ఇలా చేశారని అన్నారు. కేసును విచారించిన న్యాయమూర్తి ధర్మేందర్ రానా,అసలు టూల్ కిట్ అంటే ఏంటి, దానంతట అదే దోషపూరితం అవుతుందా, అసలు ఈ మహిళకు, జనవరి 26 నాటి హింసాత్మక ఘటనలకు సంబంధం ఉందని సరైన సాక్ష్యాలు మీ దగ్గర ఏమున్నాయి, ఉంటే వాటిని చూపించండి అని ఆదేశించారు. ఆ తర్వాత కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు.

బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ తో, దిశా రవి తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ తన వాదన వినిపించారు. అభిప్రాయ భేదం కలిగి ఉండటం దేశద్రోహానికి సమానం కాదని కోర్టుకు చెప్పారు. తన క్లయింట్ దిశా రవి థన్ బర్గ్ ని కోరింది రైతులు లేవనెత్తిన సమస్యలకు మద్దతు కోసం అని పేర్కొన్నారు . ఆమె ఖలీస్తాన్ కోసం ట్వీట్ చేయలేదు అని కోర్టు ముందు వాదించారు. ఇప్పటికే దిశా రవి బెయిల్ పిటీషన్ పై ఫిబ్రవరి 23 కు నిర్ణయం రిజర్వ్ చేసిన కోర్టు ఈ కేసులో కీలక ఆధారాలను సమర్పించాలని ప్రశ్నించింది .