Begin typing your search above and press return to search.

కోర్టుల్లో పెండింగ్ కేసులు 3కోట్ల పై చిలుకే ..త్వరగా న్యాయం 'కల' యేనా ?

By:  Tupaki Desk   |   5 Aug 2020 3:30 AM GMT
కోర్టుల్లో పెండింగ్ కేసులు 3కోట్ల పై చిలుకే ..త్వరగా న్యాయం కల యేనా ?
X
న్యాయం .. ఈ రోజుల్లో కోర్టుల్లో న్యాయం జరగాలి అంటే సంవత్సరాల ప్రకారం కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండాల్సిందే. అలా కోర్టు మెట్లు ఎక్కి దిగినా కొన్ని కేసుల్లో మనం బ్రతికుండగా తీర్పు వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము. న్యాయం ఆలస్యమవడం కూడా అన్యాయమే అన్నది చాలామంది వాదన. భారత్‌ లో పరిస్థితి ఇందుకు సరిగ్గా సరిపోతుంది. దేశంలోని కోర్టుల్లో కోట్లకొద్ది కేసులు పెండింగ్‌ లో ఉండటమే ఈ పరిస్థితికి కారణమైంది. చాలా కేసుల్లో న్యాయం ఆలస్యమవుతుండటంతో.. అది దోషులకు వరంగా, బాధితులకు శాపంగా మారుతోంది. సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు పెరిగిపోతున్న పెండింగ్ కేసుల విషయంలో ప్రభుత్వం తోపాటు, కోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.

అన్ని స్థాయిల్లో దేశంలో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్ ‌లో ఉండటం విచారకరం అని అయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లో తీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోంద‌ని చెప్పారు. చట్టాల రూపకల్పన కూడా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, స్పష్టంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఇటీవల ప్రయివేటు ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని విచారం వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల న్యాయస్థానాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుందన్నారు.

సమాజంలోని పేద, అణగారినవర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇకపోతే, దేశంలో జనాభా నిష్పత్తికి అనుగుణంగా కోర్టులు లేకపోవడం కూడా పెండింగ్ కేసులు పేరుకుపోవడానికి మరో ప్రధాన కారణం. అలాగే కేసుల సంఖ్యకు, దేశంలో ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తుల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకపోవడం,న్యాయమూర్తుల నియామకంలో జాప్యం వల్ల.. ఉన్న న్యాయమూర్తుల పైనే పనిభారం పెరగడం కూడా పెండింగ్ కేసులు గుట్టలా పేరుకుపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.