భారత్‌లో బుల్లెట్ రైలు.. మరింత ఆలస్యమేనా..?

Wed Jul 06 2022 10:48:12 GMT+0530 (India Standard Time)

Delay of Bullet train in India

గంట వ్యవధిలో వందల కిలోమీటర్లు పరుగు పెట్టే బుల్లెట్ రైలు ను భారత్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కార్ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును కూడా మొదలు పెట్టింది. కానీ దీనికి అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయి.దేశంలో ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేందుకు గానూ హైస్పీడ్ రైలు మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబయి-అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు  ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనా అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుండడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పటివరకు పూర్తవుతుందని ప్రశ్నిస్తూ ఠాణెకు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశాడు. ఇందుకు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ తాజాగా సమాధానమిచ్చింది. '

"మొత్తం రూ.లక్షా 10వేల కోట్లతో చేపడుతోన్న ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.26872కోట్లు ఖర్చుచేశాం. 297 గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. 1396 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇప్పటికే 1248 హెక్టార్లను సేకరించాం. వన్యప్రాణుల సంరక్షణ అటవీశాఖతోపాటు ఇతర అనుమతులు కూడా వచ్చాయి. అయితే కొవిడ్ ప్రభావం లాక్‌డౌన్ మహారాష్ట్రలో భూసేకరణకు ఎదురవుతోన్న ఇబ్బందులపై అంచనాలు వేసిన తర్వాతే తుది గడువు నిర్దేశిస్తాం" అని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వెల్లడించింది.

ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతున్న రైలు కారిడార్ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. జపాన్ సహకారంతో కేంద్రం ఈ ప్రాజెక్టు చేపడుతోంది.
 
గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఐదు గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా.. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.