Begin typing your search above and press return to search.

ప్రేమిస్తే చంపేయడమేనా ? ప్రాణం ముఖ్యమా..పరువు ముఖ్యమా ?

By:  Tupaki Desk   |   26 Sep 2020 1:00 PM GMT
ప్రేమిస్తే  చంపేయడమేనా ? ప్రాణం ముఖ్యమా..పరువు ముఖ్యమా ?
X
ప్రేమించడం ఏమైనా నేరమా ? ప్రేమించడం తప్పు కాదు.ఎందుకంటే అసలు ఈ ప్రేమ ఎవరిపై ఎప్పుడు పుడుతుందో ? ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కనీసం ప్రేమించే వారికీ కూడా ఒక పట్టున ఈ విషయం తెలియదు. అయితే మారుతున్న సమాజంలో , ఆ సమాజానికి తగ్గట్టుగా ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు చాలా జరుగుతున్నాయి. వాటిల్లో కులాంతర, మతాంతర వివాహాలు కూడా ఉంటున్నాయి. అయితే, తమ మాటలను పట్టించుకోకుండా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని కొంతమంది పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వారి ఆగ్రహానికి కులం, వంశ ప్రతిష్ట అనే రెండు భావనలు ఆజ్యం పోస్తున్నాయి. అలాగే డబ్బు లేదని మరికొందరు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకి అయిన వారు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్నారు.

తాజాగా హేమంత్ హత్యోదంతమే ఇందుకు నిదర్శనం. ఈ హత్య కాదు ఇలాంటి పరువు హత్యలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ప్రణయ్ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పరిచయం స్నేహంగా... స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోలేదు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల బతుకేదో వాళ్లు బతుకుతున్నారు. సాఫీగా సాగుతున్న వారి జీవితానికి అమ్మాయి తరఫు పెద్దలే విలన్లుగా మారారు. పగబట్టారు. తక్కువ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకొని కూతురు పరువు తీసిందని కక్షగట్టారు. చావుతో ముగింపు పలికారు. అమృత ప్రణయ్ ప్రేమ కథ ఇది. ఇప్పటికీ సమాజంలో అగ్రవర్ణాల కుల దురహంకారం, కులాంతర వివాహం చేసుకుంటే జరగబోయే దారుణాలను కళ్లకు కట్టినట్టు ఆ సినిమాలో చూపించిన తీరు అందర్నీ కలచివేసింది.

ఇప్పుడు మరో పరువు హత్య జరిగింది. అదే హేమంత్ హత్య.. చందానగర్‌లోని తారానగర్‌ కు అవంతి రెడ్డి బీటెక్‌ చేయగా, యోగ హేమంత్‌ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్ గా బిజినెస్‌ చేస్తున్నాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో, ఈ ఏడాది జూన్‌ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే చందానగర్ పోలీసులను ఆశ్రయించగా.. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కూతురి చర్యను జీర్ణించుకోలేకపోయిన అవంతి తండ్రి.. హేమంత్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఇంట్లోనే ఈనెల 20న హేమంత్ హత్యకు ప్లాన్ వేసి, ఆ బాధ్యతను బావమరిదైన యుగందర్ రెడ్డికి అప్పగించాడు. ఆ తర్వాత యుగంధర్ రెడ్డి తనకు పరిచయమున్న మాజీ నేరస్తులైన ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా, బిచ్చూ యాదవ్ లను సంప్రదించిఎం రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్ గా లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు. ప్లాన్ చేసిన నాలుగు రోజుల తర్వాత కిరాయి హంతకులు దానిని అమలులో పెట్టారు.

వీరు తొందర్లో తీసుకున్న ఏ కఠిన నిర్ణయానికి ఓ భార్య కి చిన్న వయస్సులోనే భర్త చనిపోయాడు. ఓ అమ్మ కి కొడుకు దూరమైయ్యాడు. ఈ హత్య వల్ల ఇప్పుడు రెండు కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత నాలుగైదు ఏళ్లుగా ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు... ప్రేమించి , పెళ్లి చేసుకున్న పాపానికి అన్యాయంగా ఓ ప్రాణాన్ని తీసేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలని ప్రాణంగా పేమించి .. వారి భవిష్యత్ కోసం ఎన్నో కలలు కనే తల్లిదండ్రులు ఒక్క నిముషం ప్రశాంతంగా ఆలోచిస్తే ఇలాంటి ఘటనలు జరగవని , ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలని చెప్తున్నారు. అలాగే ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లోని పెద్దవారిని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సొంతోషంగా ఉంటారు. ఏదేమైనా ఈ పరువు హత్యలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం.
Tags: