దీక్ష ఎఫెక్ట్: 10మందికి కరోనా.. ఐసోలేషన్లో షర్మిల!

Tue Apr 20 2021 05:42:13 GMT+0530 (IST)

Deeksha effect 10 leaders test +ve Sharmila in isolation

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో ఆమె ఇందిరాపార్క్ వద్ద చేసిన దీక్షకు భారీగా అభిమానులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్ అభిమానులు షర్మిలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. అయితే కొన్ని రోజులుగా తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు షర్మిల దీక్షకు ఎఫెక్ట్ కలిగించాయి. ఈ దీక్షలో పాల్గొన్న10 మంది సీనియర్ లీడర్లకు కరోనా పాజిటివ్ రిపోర్డు రావడంతో వారంతా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయం తెలియగానే షర్మిల కూడా ఇంట్లోనే ఐసోలేషన్ లోకి వెళ్లారు.షర్మిల చేసిన నిరాహార దీక్షలో పాల్గొన 10 మంది సీనియర్ లీడర్లకు కరోనా వైరస్ సోకింది. వారిలో పిట్ట రాంరెడ్డి కొండా రాఘవరెడ్డి సంగారెడ్డి ఇన్ చార్జి శ్రీధర్ రెడ్డి లు హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయం తెలియగానే షర్మిలతో పాటు ఆమె తల్లి విజయమ్మ ఆందోళన చెందారు. ఎందుకంటే దీక్షా కార్యక్రమంతోపాటు లోటస్ పౌండ్ లో వీరితో మాస్క్ లు లేకుండానే సమావేశం నిర్వహించారు. దీంతో వారికి లక్షణాలు బయటపడినట్టు సమాచారం. ఇప్పుడు ఆ నేతలంతా  హోంక్వారంటైన్ కు వెళ్లారు.  

ఇదిలా ఉండగా నిరుద్యోగుల కోసం ఎన్నో అంచనాలతో షర్మిల చేపట్టిన దీక్ష ఫెయిలయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ దీక్షా కార్యక్రమానికి వైఎస్ అభిమానులు తప్ప నిరుద్యోగుల నుంచి మద్దతు లభించలేదనే వాదన వినిపిస్తోంది. ఓ వైపు కరోనా మరోవైపు ప్రచారం లేకపోవడంతో షర్మిల దీక్ష జనాల్లోకి వెళ్లలేదని అంటున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల ఎవరి జాగ్రత్తల్లో వారుంటున్నారు. దీంతో ఎటువంటి కార్యక్రమాలు పట్టించుకోవడం లేదు.

మరోవైపు షర్మిల దీక్షకు కొన్ని మీడియా సంస్థలు మాత్రమే కవరేజి ఇచ్చాయి. దీంతో ప్రజల్లోకి షర్మిల దీక్ష వెళ్లలేదని అంటున్నారు. మిగతా మీడియా అంతా నాగార్జున సాగర్ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టింది. దీంతో అనుకున్న స్థాయిలో దీక్షను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని అంటున్నారు. అయితే కరోనా తీవ్రత తగ్గిన తరువాత షర్మిల మరో కార్యక్రమం ద్వారా జనాల నాడి పట్టాలని భావిస్తున్నారట. మరి ఎటువంటి కార్యక్రమం చేపడుతారో చూడాలి.