తగ్గడంలో తప్పేమీ లేదు

Wed Nov 24 2021 23:00:01 GMT+0530 (IST)

Decisions was reversed by Jagan And Modi

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. ఇదీ ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. ప్రస్తుత రాజకీయాలకు అది సరిగ్గా సరిపోతుందేమో! అటు కేంద్రంలో మోడీ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్కు ఇప్పుడదే వర్తిస్తుంది. పరిస్థితులు ప్రకారం ఈ ఇద్దరు నాయకుల తమ నిర్ణయాల్లో వెనక్కి తగ్గారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంతటి నాయకుడైనా ప్రజల వ్యతిరేకతను అర్థం చేసుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశవ్యాప్తంగా మెజారిటీ సంఖ్యలో రైతులు వ్యతిరేకించినప్పటికీ ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. దీంతో వాటిని రద్దు చేయాలని ఏడాదిగా రైతులు పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ హరియాణా ఢిల్లీ రైతులు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దు వద్ద ఎండకు ఎండి వానకు తడిసి చలిలో వణుకుతూ పోరాటం సాగించారు. ఈ ఉద్యమంలో భాగంగా చెలరేగిన హింసలో ఎంతో మంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు.

కానీ ఇవన్నీ చూశాక కూడా మోడీ ఏం పట్టన్నట్లే ఉన్నారు. మూడు రైతు చట్టాలపై వెనక్కి తగ్గేదే లేదని పలుమార్లు బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు మూడు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మోడీ ఆశ్చర్యపరిచారు.

ఓ వైపు మోడీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత.. వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దీపావళి సందర్భంగా పెట్రోల్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని మోడీ తగ్గించారు.

ఇక ఇప్పుడు ఏపీలో చూసుకుంటే మూడు రాజధానుల కోసం తీసుకు వచ్చిన వికేంద్రీకరణ సీఆర్డీఏ చట్టాలను మండలి రద్దు నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకున్నారు. ఓ వైపు అమరావతి కోసం ఉద్యమం సాగుతున్న సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కానీ హైకోర్టులో ప్రస్తుతం వికేంద్రీకరణ సీఆర్డీఏ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సాగుతోంది. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని భావించే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మళ్లీ మార్పులతో మూడు రాజధానుల బిల్లులను రూపొందిస్తామని జగన్ ప్రకటించడమే అందుకు కారణం. అయితే గతంలో అసలు శాసన మండలే వద్దని భావించిన జగన్.. ఇప్పుడు దాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.

గతంలో మండలిలో బలం లేకపోవడంతో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు మెజారిటీ ఆ పార్టీదే. దీంతో మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ఈ సమయంలో జగన్ ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనక.. చంద్రబాబు కన్నీటి ప్రభావాన్ని మాయం చేయాలనే వ్యూహం దాగి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.