ఇండిపెండెన్స్ డే నాడు అప్పులు కేంద్రంపై కేసీఆర్ ఫైర్

Mon Aug 15 2022 15:32:08 GMT+0530 (IST)

Debts on Independence Day, KCR fire on Centre

అందరూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశానికి సేవ చేసిన వారు.. తమ ప్రభుత్వాల విజయాలను చెప్పుకుంటుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆడిపోసుకోవడానికే టైం కేటాయించాడు. స్వాంతంత్య్ర దినోత్సవ ఫంక్షన్ ను కూడా దానికే వినియోగించాడు.తెలంగాణ అప్పుల పాలైందన్న విమర్శలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చాడు. తమ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందన్నది కొంత మంది అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. 2019-2 రాష్ట్ర అప్పుల మొత్తం రూ.2.25 లక్షల కోట్లుగా ఉందన్నారు.

2014లో తెలంగాణ ఏర్పడే నాటికే అప్పు రూ.75వేల కోట్లుగా ఉంటే.. తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.49 లక్షల కోట్లని చెప్పారు. ఈ రుణ మొత్తాన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించామని తెలిపారు.

ఇక కేంద్రాన్ని కూడా ఈ ప్రసంగంలో వదలలేదు కేసీఆర్. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపర్చాలని పన్నుల వాటాను కుదించాలని కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పన్నుల రూపంలో చెల్లించే దాంట్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సెస్సుల రూపంలో కేంద్రం దొడ్డిదారిన ఆదాయం సముపార్జిస్తోందని.. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. దీనివల్ల ఎఫ్ఆర్బీఎం కింద తీసుకునే రుణాల్లో కోత పెడుతోందని ఫైర్ అయ్యారు.

మొత్తంగా కేసీఆర్ తొలిసారి అప్పులు చేశామని.. అవి ఎంతో లెక్కలు చెప్పారు. అయితే అవి ప్రజల కోసమే ఖర్చు చేశామని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. కేంద్రం ఎంత గోస పెడుతుందో ఏకరువు పెట్టారు.