దావోస్ టూ ఆంధ్రాస్ : ఆశ...దోశ.. అప్పడం...?

Sun May 22 2022 09:00:02 GMT+0530 (IST)

Davos Trip AndhraPradesh

దావోస్. ఎక్కడో ఉంది. ఆంధ్రాకు ఆవల ఉంది. అయితే దావోస్ తో అంధ్రులకు మంచి బంధమే ఉంది. వారి ఆశలనే వంతెనగా చేసుకుని గత టీడీపీ ప్రభుత్వం అతి పెద్ద కనెక్షన్ సెట్ చేసి పెట్టేసింది. టీడీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళలోనూ దావోస్ టూర్ ఒక స్పెషల్ గా ఉండేది. దావోస్ పర్యటన అని ఆరు నెలల నుంచి టీడీపీ అనుకూల మీడియాలో తెగ కధనాలు వచ్చేవి. అలా  అన్నీ అనుకూలంగానే వచ్చేవి.  అక్కడికి దావోస్ లో బంగారం కొండ ఉన్నట్లు. అది ఆంధ్రుల  కోసమే వెలసినట్లు. ఇక దాన్ని జాగ్రత్తగా మోసుకొచ్చి ఏపీని స్వరాంధ్రగా చేసేయడమే తరువాయి అన్నట్లుగా చాలా కధనాలు వచ్చాయి.దావోస్ టూర్ ఉన్న నెలలో మొత్తం టీడీపీ అనుకూల మీడియా ఫోకస్ అంతా అటు వైపే ఉండేది. ఈసారి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి అని భారీ అంకెలతో హెడ్డింగులు పెట్టి జనాలకు ఆశలు పెంచేసేవి. దానికి తగినట్లుగానే నాటి సీఎం చంద్రబాబు కూడా దావోస్ టూర్ కి వెళ్లి ఏపీకి మొత్తానికి మొత్తం పరిశ్రమలను తెచ్చి పెడుతున్నామని చెప్పుకునేవారు.

ఇక టీడీపీ జమానాలో  ఆఖరుసారి దావోస్ టూర్ లో చినబాబు లోకేష్ కూడా పాలుపంచుకుని తాను హైలెట్ అవడానికి చూశారు. ఈ మొత్తం దావోస్ టూర్లలో ఏపీకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అన్నది మాత్రం ఈ రోజుకీ అతి పెద్ద ప్రశ్నగానే ఉంది. ఇక నాడు వైసీపీ విపక్షంలో ఉంది. దావోస్ కి వెళ్తే పరిశ్రమలు వస్తాయా సత్తా ఉంటే ఎవరైనా మన దగ్గరకే రావాలి. ఎక్కడో వేదికలకు ఎక్కి పెట్టుబడులు రావాలీ అంటే అది జరిగే పనేనా అంటూ విసుర్లు విసిరేది.

ఓ విధంగా టీడీపీ దావోస్ టూర్లను వైసీపీ ఎగతాళీ చేసేది. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మొదటి రెండేళ్ళూ కరోనాతో దావోస్ సదస్సులే లేకుండా పోయాయి. ఆ విధంగా చూస్తే వైసీపీ మనసులో మాట ఏంటి దావోస్ మీద వారి స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలిసే అవకాశం రాలేదు. కానీ ఫస్ట్ టైమ్ ఏపీ సర్కార్ జగన్ నాయకత్వాన దావోస్ సదస్సుకు వెళ్తోంది.

ఆ విధంగా చలో దావోస్ అని జగన్ ఆయన మంత్రులు ఇలా కాలు బయటపెట్టారో లేదో అలా చినబాబు పెదబాబుల నుంచి టీడీపీ తమ్ముళ్ళు అంతా విమర్శలు లంకించుకున్నారు. చినబాబు అయితే చంద్రబాబు విజనరీ. ఎవరైనా ఆయన్ని అనుసరించాల్సిందే. ఆఖరుకు అది జగన్ అయినా అంటూ ట్వీట్లు వదిలారు. దావోస్ కి వెళ్ళి పెట్టుబడుల కోసం నాడు టీడీపీ ప్రయత్నం చేస్తే ఎద్దేవా చేసిన వైసీపీ వారు ఇపుడు దావోస్ దాసోహం అంటున్నారు అని కూడా ఆయన అంటున్నారు.

ఇక తమ్ముళ్లు అయితే తమ ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపుగా 250 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటే వాటిని రద్దు చేసిన వైసీపీ సర్కార్ ఇపుడు ఏ ముఖం పెట్టుకుని దావోస్ టూర్ చేస్తోంది అని విమర్శలు చేస్తున్నరు. అయితే తాము ఏ రకమైన ఎంఓయూలను రద్దు చేయలేదని అసలు నాడు ఆర్భాటమే తప్ప ఏపీకి ఎక్కడ పరిశ్రమలు వచ్చాయని అంటున్నారు వైసీపీ నేతలు.

మొత్తానికి చూస్తే దావోస్ వేదికగా అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీ మళ్లీ రాజకీయ యుద్ధానికి తెర తీశాయి. వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే గతంలో అన్నీ నోటి మాటలనే టీడీపీ నేతలు చెప్పేవారు అని ఇపుడు తాము అసలు పెట్టుబడులు ఏంటో ఎలా వస్తాయో ఏపీకి చూపించబోతున్నామని సరికొత్త ఆశలను నింపుతున్నారు.

మొత్తానికి చూస్తే నాడూ నేడూ కూడా దావోస్ ఏపీ ప్రజలలో కొత్త ఆసలను చిగురింపచేస్తూనే ఉంది. అయితే చిత్రమేంటి అంటే నాడు పవర్ లో ఉన్న వారు ఇటు వచ్చారు ఇటు ఉన్న వారు పవర్ లోకి వెళ్లారు. నాటి టీడీపీ మాటలను వైసీపీ వల్లె వేస్తూంటే పరిశ్రమలు తేవడం పెట్టుబడులు రప్పించడం అంత ఈజీగా అని తమ్ముళ్ళు ఎకసెక్కం ఆడుతున్నారు.

మొత్తానికి  ఏపీకి పెట్టుబడులు కావాలి. ఉపాధి జనాలకు కావాలి. పరిశ్రమలు పెడితేనే అన్నీ జరుగుతాయి. ఈ విషయంలో మాత్రం రాజకీయమే తప్ప కార్యాచరణ అయితే లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. చంద్రబాబు తో పోలిస్తే జగన్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆయన వ్యక్తిగతంగా విజయవంతమైన పారిశ్రామికవేత్త.

మరి ఆయన తన టాలెంట్ ని చూపించి ఏపీకి పరిశ్రమలు తెస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అలా కాకుండా ఎన్నికలు రెండేళ్ళు ఉండగా తాము ఏదో చెశామని చెప్పుకునే ప్రయత్నం అయితే మాత్రం ఆంధ్రులకు ఆశ దోశ అప్పడం సామెతలాగానే కధ  మిగులుతుంది. ఏది ఏమైనా దావోస్ అని  ఊరించడం కాదు  ఏపీలో వాటి  ఫలితాలు కనిపించాలి. ఇది రాష్ట్రం మేలు కోరుకునే వారి మాట.