కుమార్తెలు అర్హులే.. హైకోర్టు సంచలన తీర్పు

Sun Mar 07 2021 10:38:16 GMT+0530 (IST)

Daughters deserve it .. High Court sensational verdict

కారుణ్య నియామకాలకు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. వివాహమైనా కూడా కుమార్తెలు కారుణ్య నియామకాలకు అర్హులేనని స్పష్టం చేసింది. అవివాహిత కుమార్తెలు మాత్రమే అర్హులు అని ఎలా చెబుతారని కోర్టు ప్రశ్నించింది.కొడుకు విషయంలో లేని పెళ్లి నిబంధన కూతుళ్ల విషయంలో ఎందుకని..వివక్ష సరికాదని హైకోర్టు హితవు పలికింది. పెళ్లైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని చారిత్రక తీర్పును ఇచ్చింది.

గత ఏడాది మే 20న ఏపీఎస్ ఆర్టీసీ ఇచ్చిన ఓ సర్క్యూలర్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఓ ఉద్యోగి చనిపోయినప్పుడు కారుణ్య నియామకం కింద అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే క్రమంలో ‘పెళ్లి కాని కుమార్తె’ అని మాత్రమే అర్హురాలని పేర్కొనడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. పెళ్లి అయ్యిందన్న కారణంతో కుమార్తె పుట్టింటి కుటుంబంలో సభ్యురాలు కాదనడం దారుణమని వ్యాఖ్యానించింది.

కారుణ్య నియామక అర్హతలలో ‘అవివాహిత’ అనే పదాన్ని చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. వెంటనే పిటీషనర్ కు కారుణ్య నియామకం కింద తగిన ఉద్యోగం కల్పించాలని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ దమయంతి అనే మహిళ వేసిన ఈ పిటీషన్ పై హైకోర్టు తీర్పునిచ్చింది.