Begin typing your search above and press return to search.

అలయ్ బలయ్‌లో అసలు విషయాన్ని బయటపెట్టిన దత్తన్న

By:  Tupaki Desk   |   18 Oct 2021 4:30 PM GMT
అలయ్ బలయ్‌లో అసలు విషయాన్ని బయటపెట్టిన దత్తన్న
X
హైదరాబాద్: గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేస్తున్నారా? అందుకు ఆమె గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచే ప్రిఫేర్ చేసుకుంటారా? అంటే ఔననే అంటున్నాయి కాషాయ వర్గాలు. అంతేకాదు ఆమె ఇప్పటికే నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారంట. ఆమెను రాజకీయాల్లోకి రావాలని కొందరు బహిరంగంగా కోరుతున్నారు. దత్తన్న తన వారసుడుగా కుమారుడిని రాజకీయాల్లో దింపాలని భావించారు. అయితే కొడుకు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో తన వారసురాలిగా కుమార్తె విజయలక్ష్మిని ప్రోత్సహించడం దత్తన్న ప్రారంభించారు. విజయలక్ష్మిని మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.

ప్రతి యేటా విజయదశమి తర్వాత అలయ్, బాలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు. ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమ బాధ్యతలను దత్తాత్రేయ, విజయలక్ష్మికి అప్పగించారు. ఆహ్వానాల దగ్గర నుంచి ఏర్పాట్లన్నీ ఆమె చేతుల మీదుగా జరిగాయి. కార్యక్రమ ప్రారంభం నుంచి చివరకు దిగ్వజయంగా విజయలక్ష్మి నిర్వహించారు. అతిథులను ఆహ్వానిస్తూ, వారిని వేదికపైకి తీసుకెళ్లి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఇక నుంచి అలయ్ బలయ్ కార్యమాన్ని తానే నిర్వహిస్తానని ప్రకటించారు. పలువురు అతిథులు ఆమెకు బహిరంగంగా మద్దతునిచ్చారు. విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు.

అలయ్ బలయ్‌కి ముందే విజయలక్ష్మి రాజకీయ జీవితానికి బీజం పడింది. ఇటీవల బీజేపీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన 'ప్రజా సంగ్రామ పాదయాత్ర'లో పాల్గొన్నారు. అందరిలా అలా వచ్చి ఇలా వెళ్లకుండా చాలా రోజులు పాదయాత్రలో సంజయ్‌తో పాటు అడుగులు వేశారు. అప్పటికే ఆమె క్రియాశీలక రాజకీయాల్లో వస్తారని అందరూ అనుకున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే విజయలక్ష్మి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే సందేహం బీజేపీ నేతలను వెంటాడుతోంది. అయితే తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్కడ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాగా వేశారు. ఆయనను అక్కడి కదపడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నుంచి విజయలక్ష్మి పోటీ చేసే అవకాశం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.

సికింద్రాబాద్‌లో కుదరకపోతే చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ సీనియర్ నాయకుడు జనార్దన్‌రెడ్డి కుమారుడిని విజయలక్ష్మి వివాహం చేసుకున్నారు. చేవెళ్లలో జనార్దన్‌రెడ్డికి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో జనార్దన్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయలక్ష్మి అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటే జనార్దన్‌రెడ్డి, తన కోడలి కోసం తన సీటును త్యాగం చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలనుకుంటే జూబ్లీహిల్స్ టికెట్ అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విజయలక్ష్మి వ్యూహం ఎలా ఉందో? ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వేచిచూడాలి.