Begin typing your search above and press return to search.

లంక‌లో దాడులు!..ఈ కుబేరుడికి తీర‌ని శోకం!

By:  Tupaki Desk   |   23 April 2019 1:30 AM GMT
లంక‌లో దాడులు!..ఈ కుబేరుడికి తీర‌ని శోకం!
X
శ్రీ‌లంక‌లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడుల్లో ఇప్ప‌టిదాకా 290 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకా 500 వంద‌ల మందికి పైగా గాయాల‌పాల్జేశాయి. ఈ దాడుల్లో లంక వాసుల‌తో పాటు లంక‌లో సేద దీరేందుకు వ‌చ్చిన విదేశీ ప‌ర్యాట‌కుల‌ను కూడా పెద్ద సంఖ్య‌లోనే పొట్ట‌న‌బెట్టుకున్నాయి. గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ... ఈ దాడుల‌తో శోకంలో మునిగిపోయిన వారి ఇతివృత్తాలు క‌న్నీటిని తెప్పించేస్తున్నాయి. లంక‌లోని సుంద‌ర దృశ్యాల‌ను చూస్తే ఎంచ‌క్కా ఎంజాయ్ చూసి వ‌ద్దామ‌ని అక్క‌డ కాలుపెట్టిన చాలా మంది ఈ ఉగ్ర‌వాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి కుటుంబాలు ఇప్పుడు తీర‌ని శోకంలో మునిగిపోయాయి. ఇలాంటి ఇతివృత్తాలో ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చిన ఓ విషాదం వింటేనే గుండె త‌రుక్కుపోతోంది.

డెన్మార్క్ లో అప‌ర కుబేరుడిగా పేరున్న ఓ బ‌డా పారిశ్రామిక‌వేత్త‌కు న‌లుగురు పిల్లులుంటే.. వారిలో ముగ్గురిని ఈ దాడులు పొట్ట‌న‌బెట్టేసున్నారు. ఒకేసారి ముగ్గురు పిల్ల‌ల‌ను కోల్పోయిన స‌ద‌రు కుబేరుడు శోక‌సంద్రంలో మునిగిపోయాడు. మాట పెగ‌ల్చ‌లేని స్థితిలో ఉన్న ఆ కుబేరుడు... పిల్ల‌ల‌ను త‌ల‌చుకుని కుమిలికుమిలి ఏడుస్తున్నాడ‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. డెన్మార్క్‌ లో అత్యంత సంపన్నుడిగా ఖ్యాతిగాంచిన ఆండర్స్‌ హోల్చ్‌ పోవల్‌ సన్‌ కు నలుగురు సంతానం. హాలిడే ట్రిప్‌ కోసం ఈయన ముగ్గురు పిల్లలు శ్రీలంకకు వచ్చారు. నిన్న‌ జరిగిన బాంబు పేలుళ్లలో వీరు మరణించినట్లు ఆండర్స్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే వారు ఎక్కడ బస చేశారు - వారితో పాటు ఎవరు వెళ్లారన్న విషయాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

ఫ్యాషన్‌ ఫర్మ్‌ ‘బెస్ట్‌ సెల్లర్‌’ యజమాని అయిన ఆండర్స్‌.. డెన్మార్క్‌లోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు. ఫ్యాషన్‌ ప్రియులకు సుపరిచితమైన వెరో మోడా - జాక్‌ అండ్‌ జోన్స్‌ తదితర ప్రసిద్ధ బ్రాండ్లను ఎక్స్‌ పోర్ట్‌ చేసే ఆండర్స్‌ కంపెనీ దేశీ ఆన్‌ లైన్‌ రీటైల్‌ మార్కెట్ లో ప్రధాన స్టాక్‌ హోల్డర్‌ గా ఉంది. అంతేగాక స్కాట్లాండ్‌ లో ఉన్న మొత్తం భూభాగంలో.. ఒకటి కంటే ఎక్కువ శాతం భూములకు ఆండర్స్‌ యజమాని అని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది. ఇంత‌టి సంప‌ద ఉన్న ఈయ‌న పిల్ల‌లు విహార యాత్ర‌కు వ‌చ్చి విగ‌త జీవులుగా మారిపోయిన వైనం నిజంగానే క‌న్నీళ్లు తెప్పించేదే. ఉన్న న‌లుగురు పిల్ల‌ల్లో ఒకేసారి ముగ్గురు పిల్ల‌ల‌ను కోల్పోయిన ఆండ‌ర్స్ ఎప్ప‌టికి కోలుకుంటారో?