హైదరాబాద్ లో మళ్లీ మొదలైన కరోనా కల్లోలం ... లండన్ నుండి వచ్చిన 15మందికి పాజిటివ్

Wed Jan 27 2021 13:40:42 GMT+0530 (IST)

Dangerous Disease In Telangana

యూకే నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల్లో చాలామంది కరోనా పాజిటివ్ గా తేలుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు ఇప్పటి వరకు 5 విమానాలు రాగా అందులో వచ్చిన వారిలో 15 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది.దీనితో వారు కూర్చున్న సీట్లకు ముందు వెనక మూడు వరుసల్లోని ప్రయాణికులను క్వారంటైన్ కు తరలిస్తున్నారు. నిజానికి బ్రిటన్ లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకుని ఉండాలి. ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. అయినప్పటికీ హైదరాబాద్ వచ్చాక కొందరు పాజిటివ్ గా తేలుతుండడం అధికారులను టెంక్షన్ పెడుతుంది. దీంతో పాజిటివ్ వచ్చిన ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన మరో 300 మందిని క్వారంటైన్ లో ఉండాలని సూచించారు అధికారులు. ఇప్పటి వరకు ఇలా 15 మంది పాజిటివ్‌గా తేలగా వారందరినీ గచ్చిబౌలి లోని టిమ్స్‌కు తరలించారు. బ్రిటన్ లో చేయించుకున్న పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారికి సైతం ఇక్కడ నిర్వహించే పరీక్షల్లో పాజిటివ్ వస్తుండడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు.  

ఇకపోతే  తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 147 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 399 మంది కోలుకున్నారు.  ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 293737కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 289325 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1593కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2819 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1295 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.