Begin typing your search above and press return to search.

మరో 10 లక్షల యాంటిజెన్ కిట్లు .. టీ సర్కార్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   8 Aug 2020 7:50 AM GMT
మరో 10 లక్షల యాంటిజెన్ కిట్లు .. టీ సర్కార్ కీలక నిర్ణయం !
X
తెలంగాణలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజుల ముందు వరకు జిహెచ్ ఎం సి పరిధిలో అత్యధిక కేసు నమోదు అయ్యేవి.. కానీ జీహెచ్ ఎం సీ పరిధిలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ , ఇతర జిల్లాలకి కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా విస్తృత స్థాయిలో కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే..ఇప్పటికే ఐదు లక్షల రాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉండగా మరో పదిలక్షల రాపిడ్ కిట్ల కొనుగోలుకు వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

తాజాగా కరోనా పై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ రోజుకు 40 వేలకుపైగా టెస్టులు చేయాలని ఆదేశించడంతో అవసరమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా వాటి సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న సంచార వాహన పరీక్షల మాదిరి జిల్లాలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తక్షణమే కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఈ క్రమంలో ఎక్కడెక్కడ నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో అవసరమవుతాయి అన్న ప్రతిపాదనలు పంపించాలని జిల్లా అధికారులను కోరారు.

ఇకపోతే ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఏర్పాట్లన్నీ చేస్తూనే..జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స నిర్వహణకు ముందుకు వచ్చే వాటికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 150 కి పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేయడానికి అనుమతి ఇవ్వగా .. వాటిల్లో సుమారు 90 ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. దీనితో ఈ సంఖ్య కు భారీగా పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేటు వైద్య చికిత్సలకు ఏర్పాటు చేయడంపై సర్కారు దృష్టి పెట్టినట్లుగా సమాచారం.