కరోనా ఫెయిల్యూర్ పై కేటీఆర్ సూటి ప్రశ్న

Mon Jul 13 2020 14:40:52 GMT+0530 (IST)

Dangerous Disease In Telangana

పక్కనున్న ఏపీతో పోలిస్తే తెలంగాణలో టెస్టులు తక్కువగా నిర్వహించడం.. హైదరాబాద్ ఆస్పత్రుల్లో అధ్వాన్న స్థితులు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీలు.. ఇలా తెలంగాణలో కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయ్యిందంటూ ప్రతిపక్షాలు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విమర్శలకు ఇప్పటిదాకా మౌనంగా ఉన్న టీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు వ్యతిరేక ప్రచారంపై స్పందిస్తున్నారు. తొలిసారిగా కేటీఆర్ దీనిపై మాట్లాడారు.మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో కేటీఆర్ తెలంగాణలో కరోనా ఫెయిల్యూర్ విమర్శలపై సూటిగా మాట్లాడారు. “ఇలాంటి సంక్షోభ సమయాల్లో నాయకులు వారి అనుయాయులు  వెర్రి రాజకీయాలు చేస్తున్నారు. మేము కూడా ప్రతిపక్షాలకు తగిన సమాధానం ఇవ్వగలం కానీ ఇది ఒకరినొకరు విమర్శించుకునే సమయం కాదు.. వాస్తవానికి ఇది అందరూ బాధించబడుతున్న క్లిష్ట సమయం ” అంటూ వాస్తవాన్ని కళ్లకు కట్టారు.

తెలంగాణలో కరోనాను కంట్రోల్ చేయడంలో  టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కొందరు ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్నారని.. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం లేదా దేశం వైరస్ ను పూర్తిగా అరికట్టిందో చెప్పాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. మొత్తం కేసులలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. కాబట్టి కేంద్రంలో ప్రధాని మోడీ ఆయన ప్రభుత్వం విఫలమయ్యాయా? అంటూ  సంధించిన ప్రశ్నలతో ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో కేటీఆర్ పడేశారు.

అర్ధరాత్రి ఒక రోగి సోషల్ మీడియాలో కోరినప్పుడు కూడా వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించి గాంధీ ఆసుపత్రిలో చేర్పించేలా చొరవచూపారని.. మా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని కేటీఆర్ అభినందించారు. ఈటల గడియారంతోపాటు వేగంగా పని చేస్తున్నాడని..అందుకే ప్రజలు సకాలంలో చికిత్స పొందుతున్నారని తెలిపాడు.

గాంధీ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై వస్తున్న పుకార్లపై కేటీఆర్ మాట్లాడారు. 90 మందికి పైగా వృద్ధురాళ్లు.. 28 రోజుల వయసున్న శిశువు వైరస్ నుంచి ఇదే గాంధీ ఆస్పత్రి నుంచి కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. రికవరీ రేటు 98 అయితే మరణ రేటు కేవలం రెండు శాతం. ఇక్కడ రికవరీ రేటు విస్మరించి మరణాల  రేటును హైలైట్ చేస్తున్నారు. రికవరీపై మీడియా ప్రతిపక్షాలు దృష్టి పెడితే  ప్రజలకు విశ్వాసం కలిగించిన వారు అవుతారని కేటీఆర్ అన్నారు.