పుణ్యకాలమంతా కేసీఆర్ ను కలిసే జర్నీకే సరిపోతుందా?

Tue Jul 07 2020 14:15:26 GMT+0530 (IST)

Dangerous Disease In Telangana

గడిచిన వందేళ్లలో ఎప్పుడూ చూడని సిత్రమైన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఆధునిక ప్రపంచానికి ఏ మాత్రం పరిచయం లేని వైరస్ అంటువ్యాధిని ఎలా అధిగమించాలన్నది ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారపక్షంగా ఉన్న వారికి కత్తి మీద సాములా ఉందని చెప్పాలి. ప్రజల్ని రక్షించుకోవటంతో పాటు.. ఆర్థిక పరిస్థితులు కుప్ప కూలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయం లో వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇలా ఒకటికి పది పనులు అదనంగా తోడు కావటం తో పాలకులకు సమయం సరి పోని పరిస్థితి. వారితో పాటు.. ప్రభుత్వాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి పనుల ఒత్తిడి అంతకంతకూ పెరిగి పోతోంది. ఇలాంటి వేళ లో.. అనవసరమైన ప్రయాణాలు సమాయాన్ని వేస్ట్ అయ్యేలా చేస్తాయి. తాజాగానే చూడండి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. డీజీపీ మహేందర్ రెడ్డి ఇద్దరూ ఎర్రవల్లి లోని సారు ఫామ్ హౌస్ కు పయనమయ్యారు.

వారి మధ్య సమావేశం ఏకంగా రెండు గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదాయ వ్యయాలు.. పంటల సాగు.. బియ్యం పంపిణీ.. కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలతోపాటు.. ఇటీవల కాలంలో కోర్టులు చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వారు చర్చించినట్లు చెబుతున్నారు.

ఇదంతా ఓకే అయినా.. సమావేశానికి రెండు గంటల గడిపితే.. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి వెళ్లి వచ్చేందుకు మరో రెండు గంటల సమయం పట్టిందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా గంటల కొద్దీ సమయం ప్రయాణాలకే సరిపోతే.. టైం వేస్ట్ మాత్రమే కాదు..ప్రయాణాలతో త్వరగా అలిసిపోతారని.. ఇలాంటివి సరికావంటున్నారు.  మరి.. ఇలాంటి విమర్శలకు సారు దగ్గరున్న సొల్యూషన్ ఏమిటో?