Begin typing your search above and press return to search.

సీన్ మొత్తాన్ని మార్చేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   7 July 2020 5:45 AM GMT
సీన్ మొత్తాన్ని మార్చేసిన కేటీఆర్
X
మాయదారి మహమ్మారి అంతకంతకే చెలరేగిపోతున్నా.. అధికారంలో ఉన్న వారికి.. అత్యున్నత స్థానంలో ఉన్న వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించే తీరులో మాత్రం మార్పు రావటం లేదు. అదేమంటే.. తమకేమీ కాదన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు. అలాంటి ధీమానే ప్రదర్శించిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంగతి చూశారుగా? పాజిటివ్ అన్న మాట అంటే.. కాస్త డిఫెన్సులో పడినట్లు కనిపిస్తూనే.. మళ్లీ తమకేం కాదన్నట్లుగా వ్యవహరించే నేతలు.. అధికారులు చాలామందే కనిపిస్తారు.

ఎవరిదాకానో ఎందుకు.. మంత్రి కేటీఆర్ చుట్టుపక్కల ఉన్న వారినే చూడండి. అత్యధికులు మాస్కులు వాడే అలవాటున్నా.. కొందరు మాత్రం లైట్ భయ్ అంటూ.. మాస్కులు పెట్టుకోకుండా ఉండటం కనిపిస్తుంది. మాస్కు వాడొచ్చు కదా? అని కేటీఆర్ అన్నా.. పెద్దగా పట్టించుకోని పరిస్థితి. అయితే.. గడిచిన మూడు.. నాలుగు రోజుల నుంచి మాత్రం సీన్ మొత్తం మారిపోయిందంటున్నారు.

మంత్రి కేటీఆర్ పేషీలోనే కాదు.. ఆయనే ప్రోగ్రాంలో పాల్గొంటున్నా.. అక్కడి వారంతా భౌతిక దూరాన్ని పక్కాగా అమలు చేయటమే కాదు.. ముఖానికి మాస్కులు పెట్టుకుంటున్నారు. దీనికి కారణం మంత్రి కేటీఆరేనని చెబుతున్నారు. మహమ్మారి ఏ రూపంలో ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలీని వేళ.. రిస్కు తీసుకునేలా వ్యవహరించే ఏ ఒక్కరిని కేటీఆర్ ఉపేక్షించటం లేదంటున్నారు.

ఇందుకు తగ్గట్లే.. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమాన్ని చూస్తే.. అక్కడ చోటు చేసుకున్న మార్పుల్ని చూస్తే.. విషయం అర్థమైపోతుందని చెబుతున్నారు. కేటీఆర్ కు పక్కన ఎవరూ ఉండకుండా.. కనీసం ఆరేడు అడుగులు దూరం మొయింటైన్ చేస్తూ.. ప్రోగ్రాం పూర్తి చేయటం గమనార్హం. ఇలాంటి తీరు మొదట్నించి అనుసరిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. మంత్రి కేటీఆర్ అండ్ కోలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించటం వెనుకున్న అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.