Begin typing your search above and press return to search.

కరోనా భయంతో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య!

By:  Tupaki Desk   |   6 July 2020 6:00 AM GMT
కరోనా భయంతో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య!
X
హైదరాబాద్ లో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో కొన్ని రోజుల నుంచి బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడు చికిత్స చేయాలని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వారు నిరాకరించి గాంధీకి వెళ్లమన్నారు. ఈలోగానే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఇక ఎక్కువ రోజులు బ్రతకను అని భావించి ..హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... వెస్ట్‌‌‌‌ బెంగాల్ ‌‌‌‌కి చెందిన పల్టుపాన్‌‌‌‌ (34) దూద్‌‌‌‌ బౌలిలో నివాసం ఉంటూ, లోకల్ గా బంగారం దుకాణం పెట్టుకున్నడు. పది రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో శుక్రవారం మలక్‌‌‌‌ పేట్‌‌‌‌ లోని ఓ ప్రైవేట్‌ ‌‌‌హాస్పిటల్‌‌‌‌ కు వెళ్లాడు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు రోజుల పాటు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా బెడ్లు లేవని చెప్పి అతన్ని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. తనకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవుతుందని కాళ్ల వేళ్ల పడినా కనికరించకుండా గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు.

శుక్రవారం సమస్య మరింత తీవ్రం కావడంతో పాటు శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బంది వచ్చింది. తీవ్ర భయాందోళనకు గురైన అతడు శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు శ్రీరాములుకు ఫోన్‌ చేశాడు. అతడు రాగానే తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని హుస్సేన్‌ సాగర్‌ దగ్గరకు వెళితే చల్లటి గాలి వస్తుందని అక్కడికి తీసుకుని వెళ్లాలని కోరాడు. దీంతో ఇద్దరు కలిసి శుక్రవారం రాత్రి ఆటోలో ట్యాంక్‌ బండ్‌ కు చేరుకున్నారు. ఆటో ను ట్యాంక్ ‌బండ్ ‌పై ఉండే పూజా స్టాల్‌ లేపాక్షి మధ్యలో నిలిపి తాను కొద్దిసేపు అలా తిరిగి వస్తానని పల్టుపాన్‌ ముందుకు నడుచుకుంటూ వెళ్లాడు. అంతలోనే అమాంతం హుస్సేన్‌ సాగర్‌ లోకి దూకాడు. దీంతో శ్రీరాములు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పల్టుపాన్ ను కాపాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని, ఆయన డెడ్ బాడీ కూడా ఇప్పటి వరకు దొరకలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.