Begin typing your search above and press return to search.

ఏమైనా చేసే సారు.. ఇదెందుకు సాధ్యం కావట్లేదు?

By:  Tupaki Desk   |   27 Jun 2020 2:30 PM GMT
ఏమైనా చేసే సారు.. ఇదెందుకు సాధ్యం కావట్లేదు?
X
తెలంగాణ ధనిక రాష్ట్రం. ఆ విషయంలో మాటే లేదు. నా మాట వినండి. నేను చెప్పినట్లు చేయండి. అమెరికా అయ్యలా అవుతాం. దేశంలో మరేరాష్ట్రంలో లేని రీతిలో ఒక రాష్ట్ర సర్కారు కేంద్ర సాయం లేకుండా రూ.1.10 లక్షల కోట్ల ఖర్చుతో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయటం ఏమిటి? అంతటి శక్తి సామర్థ్యాలున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మహమ్మారి టెస్టుల విషయంలో ఎదుర్కొంటున్న విమర్శలు.. నిందలు అన్ని ఇన్ని కావు. ఎందుకిలాంటి పరిస్థితి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అంతకంతకూ మహమ్మారి పెరిగిపోతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా నిర్దారణ పరీక్షలు చేయటం ద్వారా.. వైరస్ వ్యాప్తి ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఇదే విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా తెలంగాణలో టెస్టులు చేయని పరిస్థితి. ఈ కారణంతోనే.. మార్చిలోకేసుల నమోదు మొదలైనా.. జులైలోకి వస్తున్నా.. రోజుకు నాలుగు వేలకు మించి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి.

ఇటీవల టెస్టులు ఎక్కువగా చేయటం.. అందుకు తగ్గట్లే ప్రజల నుంచి రిక్వెస్టులు పెరిగిన నేపథ్యంలో.. పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు సామర్థ్యం లేని కారణంగా రెండు రోజుల పాటు శాంపిళ్లను సేకరించే కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువైనప్పుడు పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 4450 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. మరి.. ఈ సామర్థ్యాన్ని పూర్థిస్థాయిలో వాడుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. గడిచిన ఐదురోజుల్లో తెలంగాణలో నమూనాల్ని సేకరించింది కేవలం 17,117 మాత్రమే.అంటే.. సరాసరిన రోజుకు 3435 మాత్రమే నమూనాల్ని సేకరించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకూ తెలంగాణలో సేకరించిన శాంపిళ్లు కేవలం 71 వేలు (కాస్త తక్కువగా) మాత్రమే.

అదే సమయంలో ఇరుగుపొరుగున ఉన్న ఏపీలో ఏకంగా 7.69లక్షల పరీక్షలు చేస్తే.. తమిళనాడులో 10.08లక్షలు చేశారు. కర్ణాటకలోనూ 5.5లక్షల శాంపిళ్లు సేకరించి పరీక్షలు జరిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసోం లాంటి రాష్ట్రంలో 3.51లక్షల నమూనాల్ని పరీక్షలు జరిపారు. ఇలా ఏ రాష్ట్రం చూసినా.. లక్షల్లో పరీక్షలు జరిపితే.. తెలంగాణ రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా నేటికి లక్ష నమూనాల్ని పూర్తి చేయలేదు. ఒకవేళ చేయాలంటే.. మరో వారం.. పది రోజులు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఏమైనా చేస్తానని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమ్మారి నిర్దారణ పరీక్షల విషయంలో ఎందుకని ఏమీ చేయలేకపోతున్నారు. కేసీఆర్ సారు లాంటోళ్లు చేయలేని పనులు కొన్ని ఉంటాయన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.