ఫూణెకు ఏమైంది? ఒక్కరోజులో దడ పుట్టించే కేసులు ఎలా?

Tue Feb 23 2021 13:00:02 GMT+0530 (IST)

Dangerous Disease In Maharashtra

కరోనామనకంటే తెలివైనదా? ఏమార్చి.. ఏమార్చి షాకులు ఇచ్చేయటం దానికో అలవాటా? ఓడినట్లే ఓడి.. అంతలోనే తీవ్రంగా విరుచుకుపడటం దాని నైజమా? ఇప్పటికే  ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి భారత్ లో సెకండ్ రౌండ్ ఆట ఆడుకునేందుకు సిద్ధమవుతుందా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. గడిచిన కొద్ది నెలలుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తగ్గటం.. పాజిటివ్ అయిన వారిలోనూ తీవ్రత తక్కువగా ఉండటంతో.. కరోనా గండం గడిచిందన్న భావనకు చాలామంది వచ్చారు. ఇలాంటివేళ..దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం ఇప్పుడు చర్చగా మారింది.గత ఏడాది ఏప్రిల్.. మేలో కరోనాతో విలవిలలాడిన ఫూణెలో కొద్దిరోజులుగా కేసుల నమోదు పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజునే ఫూణె జిల్లాలో 1176 మంది కరోనా పాజిటివ్ గా తేలింది. మొన్నటివరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు అన్నిచోట్ల కనిపించటంతో కొత్త భయం మొదలైంది. కేవలం వారం వ్యవధిలో ఫూణెలో నమోదైన కేసుల్లో మార్పులుపెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి.

గడిచిన వారంలో 2700కేసులు నమోదు కాగా.. అంతకు ముందు వారం 1658 కేసులు మాత్రమే. అంటే.. వారం వ్యవధిలో కేసుల నమోదు ఏకంగా 62 శాతం పెరగటం గమనార్హం. ఇప్పటికే ఫూణెలో రాత్రివేళలో కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఇప్పటికే ముంబయి.. ఫూణెలలో కేసుల నమోదు పెరుగుతుంటే.. తాజాగా ఆ జాబితాలోకి నాగపూర్ కూడా చేరింది. ఈ నగరంలో గడిచిన మూడు రోజుల్లో ఏకంగా రెండు వేల మందికిపైనే వైరస్ బారిన పడటం గమనార్హం.  మొత్తంగా చూస్తే.. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల  నమోదులో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

దేశ వ్యాప్తంగా చూస్తే.. ఈ నెల రెండో వారంలో 77284 పాజిటివ్ కేసులు నమోదైతే.. మూడో వారంలో (14-21) 31 శాతం పెరుగుదలతో 100990 మందికి వైరస్ సోకింది. తాజాగా కేసుల నమోదు వేగంగా మారుతున్న వేళలో.. అందరూ అప్రమత్తంగా కావాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటివరకు ముఖానికి మాస్కులు పెట్టుకోవటం.. శానిటైజ్ చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు.. ఇక మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నది మర్చిపోవద్దు.