Begin typing your search above and press return to search.

బెడ్ కావాలా..? ప్లీజ్ వెయిట్‌.. ఎవ‌రైనా పోతే ఇస్తాం..!

By:  Tupaki Desk   |   22 April 2021 10:30 AM GMT
బెడ్ కావాలా..? ప్లీజ్ వెయిట్‌.. ఎవ‌రైనా పోతే ఇస్తాం..!
X
కొవిడ్ బారిన ప‌డిన వారి ప‌రిస్థితి.. వ‌ర్ణించ‌డానికి వీళ్లేకుండా ఉంది! ఇంట్లో ఉంటే ఆక్సీజ‌న్ అంద‌ట్లేదు. ఆసుప‌త్రికి వెళ్తే ప‌డ‌క‌లు దొర‌క‌ట్లేదు. హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ఆసుప‌త్రుల‌న్నీ రోగుల‌తో నిండిపోయాయి. బెడ్ అడిగితే.. లోప‌ల ఉన్న‌వారు ఎవ‌రైనా డిశ్చార్జ్ అయితేనో.. చ‌నిపోతేనో ఖాళీ అవుతుంద‌ని, అప్పుడు ఇస్తామ‌ని చెబుతున్నారంటే.. ఎంత‌టి దారుణ‌మైన పరిస్థితులు నెల‌కొన్నాయో అంచ‌నా వేయొచ్చు.

దేశంలో కొవిడ్ కేసులు ప్ర‌పంచంలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక రోజులో 3 ల‌క్ష‌ల‌కు పైగా న‌మోద‌య్యాయి. ఈ స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ దేశంలోనూ న‌మోదు కాలేదు. అత్య‌త వేగంగా కేసులు పెరిగిపోవ‌డంతో.. ఆసుప‌త్రుల‌న్నీ నిండిపోయాయి. ఎవ‌రైనా చ‌నిపోతేనో.. డిశ్చార్జ్ అయిపోతేనో త‌ప్ప‌, కొత్త‌వారికి బెడ్ దొరికే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఇక‌, ఆసుప‌త్రుల్లో చేరిన వారి ప‌రిస్థితి కూడా ఆశాజ‌నకంగా ఏమీ లేదు. అక్క‌డ వెంటీలేట‌ర్లు లేక తీవ్ర‌ ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ఊపిరి అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 100 ప‌డ‌క‌లు ఉన్న మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రుల్లో కేవ‌లం 10 వెంటీ లేట‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ట‌.

ఇక‌, 100కు పైగా ప‌డ‌క‌లు ఉన్న సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రుల్లో 30 లోపే వెంటీలేట‌ర్లు ఉన్న‌ట్టు అంచ‌నా. దీంతో.. అత్య‌వ‌స‌ర‌మైన వారికి త‌ప్ప ఇవి అందుబాటులోకి రావ‌ట్ల‌ద‌ట‌. దీనివల్ల‌.. ఒక మోస్త‌రుగా ఉన్న‌వారి ఆరోగ్యం వేగంగా క్షీణించిపోతున్న‌ట్టు తెలుస్తోంది.

వెంటీ లేట‌ర్ మీద‌కు వెళ్లిన వారి కండీష‌న్ బ‌ట్టి.. 5 రోజుల నుంచి 20 రోజుల‌కు చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో.. డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య త‌క్కువ‌గా న‌మోద‌వుతుండ‌గా.. ఆరోగ్యం విష‌మిస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంద‌ని చెబుతు‌న్నారు.

ఇక‌, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అన్న‌ట్టుగా మారిపోయింది ప‌రిస్థితి. సర్కారు ద‌వాఖానాల్లో ఆక్సీజ‌న్ కొర‌త తీవ్రంగా వేధిస్తోంద‌ని అంటున్నారు. చికిత్స స‌రిగా అంద‌ట్లేద‌ని, ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడ‌ని అంటున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.