దేశంలో ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా అలజడి .. కొత్తగా ఎన్నంటే ?

Sun Mar 07 2021 05:00:01 GMT+0530 (IST)

Dangerous Disease In India

కరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర కేరళ పంజాబ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతుంది. గడిచిన 24 గంటల్లో కూడా ఆ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో కేవలం పై ఐదు రాష్ట్రాల్లో నమోదైన కేసులే 82 శాతం ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.మహారాష్ట్రలో అత్యధికంగా 10216 కేసులు నమోదు కాగా ఆ తర్వాత అత్యధికంగా కేరళలో 2776 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణను కూడా అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటివరకు మొత్తం 220692677 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో శుక్రవారం ఒక్కరోజే 751935 మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ తెలిపింది.          

భారత్ లో గత 24 గంటల్లో 18327 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం 14234 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11192088కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 157656కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10854128 మంది కోలుకున్నారు. 180304 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 19497704 మందికి వ్యాక్సిన్ వేశారు.