మరోసారి కరోనా విజృంభణ .. ఆ ఐదు రాష్ట్రాలే తాజా హాట్‌స్పాట్లు.. సరిహద్దులు క్లోజ్ మళ్లీ లాక్ డౌన్

Tue Feb 23 2021 14:00:01 GMT+0530 (IST)

Dangerous Disease In India

దేశంలో కరోనా మహమ్మారి జోరు మళ్లీ మొదలైంది. కొద్దిరోజులుగా పరిమితంగా నమోదవుతూ వస్తోన్న కొత్త పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీనితో దేశంలోని పలు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాయి. కొత్త కరోనా కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే అనేక రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే కర్ఫ్యూ పాక్షికంగా లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చింది.  మహారాష్ట్ర కేరళ తమిళనాడు కర్ణాటక పంజాబ్.. కరోనా కొత్త కేసులకు తాజా హాట్ స్పాట్లుగా మారాయి. ఫలితంగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం విదర్భ ప్రాంతంలో పాక్షికంగా లాక్ డౌన్ విధించింది. అమరావతి అకోలా వంటి జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. కర్ణాటక-కేరళ రాష్ట్రాలు సరిహద్దులను కట్టుదిట్టం చేశాయి. కేరళ నుంచి కర్ణాటకలో అడుగు పెట్టదలిచిన వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోన్నారు. కేరళ కర్ణాటక సరిహద్దుల్లోని థలపాడి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలను చేపట్టారు. నెగటివ్ గా ఉంటేనే అనుమతి ఇస్తున్నారు.

మహారాష్ట్ర విదర్బ ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దులపై నిఘా పెట్టింది. ఇదివరకట్లా స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా చర్యలను తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను సాగించే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలను చేపట్టనుంది. కరోనా వైరస్ లేదని నిర్ధారించే సర్టిఫికెట్లు ఉంటే తప్ప.. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ జిల్లా అధికారులకు మౌఖికంగా ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కేరళలో కరోనా కేసులు పెరిగిపోతుండటం తో కర్ణాటక ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  కేరళతో ఉన్న 13 సరిహద్దులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.  కేరళ నుంచి వచ్చే అన్ని రహదారులను మూసివేసింది.  కర్ణాటక తీసుకున్న నిర్ణయంపై కేరళ మండిపడుతున్నది.  కర్ణాటక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని దీనివలన కేరళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నది.  

ఇకపోతే గత 24 గంటల వ్యవధిలో కొత్తగా దేశవ్యాప్తంగా 10584 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11016434కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 156463 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10712665 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 11745552 మందికి వ్యాక్సిన్ వేశారు.