Begin typing your search above and press return to search.

సరికొత్త ముప్పు.. డబుల్ ఇన్ఫెక్షన్

By:  Tupaki Desk   |   26 Sep 2020 7:00 AM GMT
సరికొత్త ముప్పు.. డబుల్ ఇన్ఫెక్షన్
X
నెలలు గడుస్తున్నా మందులేని కరోనా మీద పోరు చేస్తున్న మానవాళి కిందామీదా పడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా దేశానికి సరికొత్త చిక్కు వచ్చి పడింది. కరోనాకు చెక్ పెట్టేందుకు సరైన మందులు లేక.. వైద్యులు జుట్టు పీక్కుంటున్నారు. పలు కాంబినేషన్లలో మందుల్ని వాడుతున్నారు. కొన్నిసార్లు వర్క్ వుట్ అవుతుంటే.. మరికొన్నిసార్లు కొత్త ఇబ్బందులను తీసుకొస్తున్నాయి.

తాజాగా అలాంటి చిక్కు ఒకటి చికాకు పెడుతోంది. కరోనా వేళ.. సీజనల్ గా వచ్చే డెంగీ ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. డబుల్ థమాకా మాదిరి.. డబుల్ ఇన్ఫెక్షన్ కారణంగా.. ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో అర్థం కాక వైద్యులు తల పట్టుకుంటున్నారు. ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు.

కరోనా పాజిటివ్ తో ఇబ్బంది పడుతున్న ఆయనకు డెంగీ తోడైంది. దీంతో ఆయనకు చికిత్స చేసేందుకు వైద్యులు ఇబ్బందికి గురవుతున్నారు. ఈ రెండింటికి కలిపి ఎలాంటి మందులు ఇవ్వాలన్న అంశంపై వైద్యుల మధ్య హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఒకేసారి మీద పడితే.. ఎలాంటి చికిత్స చేయాలన్న దానికి ప్రామాణికత లేకపోవటంతో.. ఎలా వైద్యం చేస్తే ఏమవుతుందో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కరోనా కారణంగా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు హెపారిన్ ఔషధాన్ని ఇస్తున్నారు. ఇది చివరగా రక్తం దాకా చేరుతుంటుంది. డబుల్ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి హెపారిన్ అందిస్తే.. వెంటనే డెంగీ చికిత్సలో భాగంగా వారి రక్తంలోకి ప్లేట్లెట్లు ఎక్కిస్తే తీవ్రమైన దుష్ప్రరిణామాలు తప్పవంటున్నారు. దీంతో.. డబుల్ ఇన్ఫెక్షన్ ను అత్యంత సున్నితంగా హ్యాండిల్ చేయాలంటున్నారు. డబుల్ ఇన్ఫెక్షన్ రోగులకే కాదు.. వైద్యులకు సైతం పెద్ద సవాలన్న మాట బలంగా వినిపిస్తోంది.