అమెరికాలో కరోనా జోరు .. 24 గంటల్లో 3157 మరణాలు

Sat Dec 05 2020 12:03:58 GMT+0530 (IST)

Dangerous Disease In America

కరోనా జోరు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా జోరు తీవ్ర స్థాయిలో ఉంది. తాజాగా అమెరికాలో ఒక్కరోజే    3 వేల 157 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. అలాగే 24 గంటల వ్యవధిలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 2 లక్షల 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. . ఒక్కరోజులో ఈ స్థాయి మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ లో తొలిదశ విజృంభణ సమయంలో నమోదైన 2 వేల 603 మరణాలే ఇప్పటి వరకు  అత్యధికం. అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 276 148కి పెరిగింది.కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. నెల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. పండగ సీజన్ కావడంతో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడంతోనే కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా నిబంధనలను గాలికొదిలేసి గుంపులు గుంపులుగా వేడుకలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే అక్కడ గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. గడచిన వారంలో అమెరికాలో 10 వేల మంది కరోనా బారిన పడి మృతి చెందగా 11 లక్షలకు పైగా మంది ప్రజలకు ఈ వైరస్ సోకింది. మరోవైపు అమెరికాలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ఇప్పటికే ఫైజర్ మోడెర్నా అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. ఆక్స్ఫర్డ్ ఫైజర్ మోడర్నా ఆస్ట్రాజెనకా వంటి ఫార్మా దిగ్గజాలు చివరి దశ ప్రయత్నాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ టీకాను కరోనా వారియర్స్ గా గుర్తింపు పొందిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందజేయాలని దాదాపు అన్ని దేశాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ లో వచ్చే వారం నుంచి వ్యాక్సిన్ కు సంబంధించి సరఫరా చేయనున్నట్టు తెలిపింది.