Begin typing your search above and press return to search.

కరోనాను లైట్ తీసుకుంటున్నారా? ఈ లెక్కలు చూస్తే గొంతు తడారిపోతుంది

By:  Tupaki Desk   |   4 Dec 2020 3:38 AM GMT
కరోనాను లైట్ తీసుకుంటున్నారా? ఈ లెక్కలు చూస్తే గొంతు తడారిపోతుంది
X
కరోనాను తక్కువగా అచనా వేయటానికి మించిన తప్పు పని మరొకటి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత గతంతో పోలిస్తే.. తగ్గినప్పటికి అలాంటి పరిస్థితి అన్నిచోట్ల ఉందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అలాంటి పరిస్థితి చాలా దేశాల్లో నెలకొంది. కరోనా తీవ్రత తగ్గిందని భావిస్తున్నప్పటికీ.. నిన్న ఒక్కరోజులోనే ప్రపంచ వ్యాప్తంగా 6.56లక్షల కేులు నమోదైతే.. నిన్న ఒక్కరోజునే మహమ్మారి కారణంగా మరణించిన వారు 12,329 మంది. అది కూడా అధికారిక లెక్కల్లో. అనధికారికంగా నమోదైనవి ఎన్నో లెక్క కూడా వేయలేని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అగ్రరాజ్యమైన అమెరికను కరోనా వణికిస్తోంది. ఆ దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు.. మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. రోజువారీగా అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఒక రోజులో 2,13,013 కేసులు నమోదు కాగా.. ఒకరోజులో చోటు చేసుకున్న మరణాలు కూడా ఎక్కువే. ఈ మహమ్మారి అమెరికన్ల ప్రాణాల్ని భారీగా తీస్తోంది. నిన్నటి రోజున 2790 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో.. మరణాల సంఖ్య 2.82లక్షలకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మరణాల్లో అమెరికా వాటా 18శాతంగా ఉండటం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్.. భారత్.. మెక్సికో.. బ్రిటన్ దేశాలు నిలుస్తున్నాయి. మరణాల్లోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉంది. మరణాల్లో భారత్ తర్వాత మెక్సికో నిలుస్తోంది. ఇక.. మన దేశానికి వస్తే.. ఒక్కరోజులో నమోదైన కేసులు 35,551 కాగా.. 526 మంది మరణించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. పరిస్థితి మెరుగైందని చెప్పాలి. తెలంగాణలో 609 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏపీలో 664 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 56.05లక్షల శాంపిల్స్ ను పరీక్షించగా.. ఏపీలో మాత్రం 1.02కోట్ల శాంపిల్స్ ను పరీక్ష జరిపారు. కరోనా తగ్గిపోలేదు. దాని ప్రభావం తగ్గలేదు. కేవలం.. మనమిచ్చే ప్రాధాన్యత మాత్రమే తగ్గిందన్న విషయం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే అర్థం కాక మానదు. సో.. జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.