Begin typing your search above and press return to search.

జగన్ సాబ్.. మీ వరకు ఈ విషయం వచ్చిందా?

By:  Tupaki Desk   |   19 Oct 2020 6:45 AM GMT
జగన్ సాబ్.. మీ వరకు ఈ విషయం వచ్చిందా?
X
కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేకుండా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థానికంగా ఉండే ఉన్నతాధికారుల అత్యుత్సాహం.. అనాలోచిత నిర్ణయాలు.. కిందిస్థాయి సిబ్బంది ముందు వెనుకా చూసుకోకుండా అమలు చేసే తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే పార్టీ నేతల నుంచి అందే ఫీడ్ బ్యాక్ తో తప్పును సరిదిద్దే అవకాశం ఉంటుంది. తాజాగా ఏపీలోని వరదముంపుప్రాంతానికి చెందిన బాధితుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గడిచిన కొద్దిరోజులుగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లంక గ్రామాలు.. విజయవాడ పరిసర ప్రాంతాలు తీవ్రమైన ప్రభావానికి గురవుతున్నాయి. దీనికితోడు.. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉధృతి తో వేలాది కుటుంబాల ఇళ్లు నీళ్ల పాలయ్యాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో.. వారిని ఇందిరాగాంధీ స్టేడియంలో తాత్కాలిక పునరావాస శిబిరాల్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉన్నట్లుండి స్టేడియంలోకి వచ్చిన పోలీసులు.. నిరాశ్రయులంతా వెంటనే స్టేడియంను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఓవైపు వరద తీవ్రత తగ్గకుండా.. తాము ఎక్కడకు వెళతామని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు.. బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో పాటు.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమకు మరో చోటును చూపిస్తే.. ఖాళీ చేయటానికి అభ్యంతరం ఏమీ లేదని చెప్పినా.. పోలీసులు మాత్రం తమకు సంబంధం లేదని.. ముందు అయితే ఇందిరాగాంధీ స్టేడియంను ఖాళీ చేయాలని చెప్పటంతో బాధితులు దిక్కు తోచని పరిస్థితిలో చిక్కుకున్నారు. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు కృష్ణా నదికి వరద పెరుగుతున్న వేళ.. ఖాళీ చేయమంటే ఎలా? అన్నది బాధితుల ప్రశ్న. ఇంతకూ వీరిని వెంటనే ఎందుకు ఖాళీ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న విషయంలోకి వెళితే.. ఈ నెల 21న (బుధవారం) పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఖాళీ చేయాలని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల తర్వాత నిర్వహించేకార్యక్రమం కోసం వందలాది మంది బాధితుల్ని ఖాళీ చేయాలని బలవంతం పెట్టటం మంచిది కాదని.. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు తక్షణమే తన వద్దకు సమాచారం అందేలా.. సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.