Begin typing your search above and press return to search.

యాభై వేల మందితో పాదయాత్రట.... వైసీపీ మంత్రి టార్గెట్

By:  Tupaki Desk   |   1 Oct 2022 9:33 AM GMT
యాభై వేల మందితో పాదయాత్రట.... వైసీపీ మంత్రి టార్గెట్
X
ఏపీలో రాజకీయాలు ఇపుడు యాత్రలు పాదయాత్రల చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి రైతులు అరసవిల్లి దాకా పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి విధితమే. మరి అధికార పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అందుకే తాము అనుకున్న విధంగా మూడు రాజధానుల ఇష్యూని జనాల్లోకి తీసుకెళ్ళేందుకు వికేంద్రీకరణ మీద రౌండ్ టేబిల్ సమావేశాలు పెడుతోంది. విశాఖలో ఒక సమావేశం జరిగింది. ఇపుడు కాకినాడలో మరోటి పెట్టారు.

ఈ సమావేశంలో మంత్రి దాడిశెట్టి రాజా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానులు అన్నవి ఏపీకి అత్యవసరం అని ఆయన అంటున్నారు. హైదరాబాద్ మోడెల్ ఏపీకి కుదరదు అని తేల్చేశారు. గతంలో అరవైఏళ్ళ పాటు అలాగే అన్నీ ఒకే చోట పెట్టేసి చివరికి విభజన తరువాత ఉత్త చేతులతో వెనక్కి తిరిగి వచ్చేశామని ఆయన పాత హిస్టరీ తిరగతోడారు.

ఇపుడు చంద్రబాబు అదే ఫార్ములాను అందుకుని అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాలకే మొత్తం ఏపీ ప్రజల సంపద అంతా కుప్ప పోసి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు అని విమర్శించారు. అదే కనుక చేస్తే ప్రజలు కట్టిన పన్నులతో అక్కడ మాత్రమే అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాల సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులు తాము చెప్పిందే జరగాలని ఏపీ మొత్తాన్ని శాసించాలని చూస్తున్నారని వారి వెనకాల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని దాడిశెట్టి రాజా విమర్శించారు.

అయిదారు వందల మందితో పాదయాత్ర చేసి అమరావతి రాజధానిగా ఉంచాలని కోరితే తాను యాభై వేల మందితో ఇంతకంటే భారీ ఎత్తున పాదయాత్ర ఏపీలో నిర్వహిస్తానని, ఏపీ మొత్తం అభివృద్ధి అంతా కాకినాడలో ఉంచాలని తాను డిమాండ్ చేస్తే అంతా ఒప్పుకుంటారా అని దాడిశెట్టి రాజా లాజిక్ పాయింట్ ని లాగారు.

ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని జగన్ మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు దక్కితే బాగుంటుంది అన్నదే తమ ప్రభుత్వం విధానం అని ఆయన అంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర వెనక చంద్రబాబు ఉన్నారని, ఆయన ఆలోచనలు ఎపుడూ అమరావతి బాగుపడితే చాలు అన్నట్లుగానే ఉన్నాయని రాజా విమర్శించారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా ఏపీలో కీలక ప్రాంతాలలో రెండు రౌండ్ టేబిల్ సమావేశాలను నిర్వహించిన వైసీపీ పెద్దలు మరిన్ని చోట్ల వాటిని నిర్వహించాలని చూస్తున్నారు. ఇంకో వైపు హైకోర్టు అమరావతే ఏకైక రాజధాని అంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వ సుప్రీం కోర్టుకు స్టే కోసం వెళ్లింది. అంటే ఒక వైపు న్యాయపరంగా మరో వైపు రాజకీయంగా వైసీపీ ఈ విషయం మీద పోరాటం చేయాలని చూస్తోంది అన్న మాట. మరి వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా అంటున్నాట్లుగా ఫ్యూచర్ లో యాభై వేల మందితో ఏపీ అంతా పాదయాత్ర చేస్తారా. అలాంటి ప్లాన్ ఏదైనా వైసీపీ వద్ద ఉందా అన్నదే చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.