Begin typing your search above and press return to search.

నేతాజీ అస్థికలకు డీఎన్ఏ టెస్ట్... అన్నీ అనుమానాలే...?

By:  Tupaki Desk   |   24 Jan 2022 11:31 AM GMT
నేతాజీ  అస్థికలకు డీఎన్ఏ టెస్ట్... అన్నీ  అనుమానాలే...?
X
ఆయన పుట్టి ఇప్పటికి 125 ఏళ్ళు అయింది. ఇక ఆయన మరణించి కూడా 76 ఏళ్ళు అవుతోంది. అయితే ఆయన ఎలా మరణించారు అన్నది మాత్రం ఈ రోజుకీ తేలకపోవడం బాధాకరం. నేతాజీ అదృశ్యం అయ్యారు అని ఒక ప్రచారం ఉంది. ఆయన విమాన ప్రమాదంలో అసువులు బాసారు అని కూడా మరో ప్రచారం ఉంది. ఆయన సన్యాసిగానే జీవితాంతం బతికారని మరో ప్రచారం ఉంటే నాటి రష్యా ప్రభుత్వం ఆయన్ని జైలులో బంధించిందని ఇంకో పుకారు కూడా ఉంది.

ఇవన్నీ ఒక మహనీయుడి విషయంలో రావడం అంటే విషాదమే. చరిత్రలో మహాపురుషుల జీవితాలకు సంబంధించి అన్ని విషయాలు పొందుపరుస్తారు. అవి భావి తరాల కొరకు పదిలంగా ఉంటాయి. కానీ నేతాజీ విషయానికి వస్తే మాత్రం ఆయన పుట్టిన దగ్గర నుంచి 1946 వరకూ మాత్రం పక్కాగా అంతా ఉంది. విమాన ప్రమాదం ఘటన తరువాత ఏం జరిగింది అన్నది ఈ రోజుకీ తెలియదు అంటే భారతీయులు అంతా బాధపడుతున్నారు.

తెల్లవారిని ఎదిరించిన ధీరోధాత్తుడైన నాయకుడి చరిత్రలో చివరి పుటలు అనుమానాలకు, ప్రచారానికి మధ్య చర్చగా మిగిలిపోవడం కంటే విషాదం వేరొకటి ఉండదు. ఇదిలా ఉండగా తాజాగా నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవరాలు మాధురీ బోస్ మాటలను బట్టి చూస్తే నేతాజీ మరణం వెనక అనుమానాలు మరింత పెరిగేవిగానే ఉన్నాయి.

టోక్యోలోని రెంకోజీ ఆలయ‌ మందిరంలోని నేతాజీ అస్థికలుగా చెబుతున్న వాటికి ఎందుకు డీఎన్ఏ పరీక్షలు ఈ రోజు దాకా నిర్వ‌హించలేదు అని మాధురీ బోస్ అడుగుతున్న సూటి ప్రశ్న భారతీయులను ఆలోచింపచేస్తోంది. దానికి కేంద్రం నియమించిన ముఖర్జీ కమిషన్ అయితే రెంకోజీ ఆలయ పూజారి అనుమతి ఇవ్వలేదు అని అంటోంది. కానీ అది నిజం కాదని మాధురీ బోస్ చెబుతున్నారు. జపాన్ భాషలో రాసిన రెంకో ఆలయ పూజారి నిచికో మోచీ చూకీ లేఖను తాము అనువదింపచేశామని, డీఎన్ఏ పరీక్షలు చేసుకోవచ్చు అంటూ పూజారి 2005లో రాసిన లేఖలో ఉందని ఆమె అంటున్నారు.

మరి అంతలా చెప్పినా ఎందుకు అస్థికల విషయంలో పట్టించుకోలేదు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా ఉంది. ఇక ముఖర్జీ కమిషన్ 2006లో పార్లమెంట్ కి సమర్పించిన నివేదికలో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదు అని పేర్కొంది. మరి నేతాజీ ఎలా చనిపోయారు అన్న అనుమానాలు అయితే అలాగే ఉండిపోయాయి. అదే సమయంలో రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవి కావని ముఖర్జీ కమిషన్ పేర్కొంది.

మరి ఎటువంటి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించకుండా నేతాజీ అస్థికలు అవి కావు అని చెప్పడమే ఇక్కడ సందేహాలకు ఆస్కారం ఇస్తోంది అని అంటున్నారు. ఇక జపాన్ లోని భారత రాయబారి ఎం ఎల్ త్రిపాఠి సమక్షంలోనే తాను అస్థికల డీఎన్ఏ పరీక్షలకు అంగీకరిస్తున్నట్లుగా ఆలయ పూజారి నిచికో మోచీ చూకీ చెప్పిన విషయాన్ని కూడా మాధురీ బోస్ ప్రస్థావించారు.

విషయం ఇలా ఉంటే ఈ రోజుకీ ఎందుకు ఆ పూజారి రాసిన లేఖను బహిర్గతం చేయలేదో, డీఎన్ఏ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదు అన్నది అర్ధం కావడం లేదని మాధురీ బోస్ అంటున్నారు. ఇలా పరీక్షలు చేయకపోవడంతో నేతాజీవే ఆ అస్థికలు అని తాను నమ్ముతున్నట్లుగా ఆమె పేర్కొనడం విశేషం. నేతాజీ అస్థికలను పరీక్షించాలని గతంలో కూడా తమ కుటుంబం అంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని కూడా ఆమె గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి చూసుకుంటే నేతాజీ ఎలా మరణించారు అన్నది ఈ రోజుకీ భారతదేశానికి స్పష్టంగా తెలియడంలేదు, మరి ఆయన కుటుంబ సభ్యుల డిమాండ్ ని పట్టించుకోవడంలేదు, మరి నేతాజీ 125వ జయంతి వేడుకలు మాత్రం ఘనంగా జరిగాయి. ఆయనకు నివాళులు అంతా అర్పించారు. ఈ సమయాన అంతకంటే ముఖ్యమైన ఆయన మరణ రహస్యాన్ని ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రతీ భారతీయుడి కోరిక కూడా. మరి అది జరుగుతుందా.