Begin typing your search above and press return to search.

డీఎంకే- కాంగ్రెస్ కూటమికి కటీఫ్.. తేడా ఎందుకొచ్చిందంటే?

By:  Tupaki Desk   |   7 March 2021 4:26 AM GMT
డీఎంకే- కాంగ్రెస్ కూటమికి కటీఫ్.. తేడా ఎందుకొచ్చిందంటే?
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు. ఆ మాటకు వస్తే.. అంతకుమించే అని చెప్పాలి. కష్టకాలంలో స్నేహంగా ఉంటూ.. అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలన్ని ఎక్కువగా ఉన్న వేళ.. అనవసరమైన కారణాలతో స్నేహానికి కటీఫ్ చెప్పాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా? అంటే అవునని చెప్పాలి. సీట్ల పంచాయితీ ఎంతకూ తెగకపోవటమే కాదు.. గతంలో తమకు కేటాయించిన స్థానాల్లో కోత పెట్టిన స్నేహితుడు డీఎంకేకు కటీఫ్ చెప్పేసి షాకివ్వాలని తమిళ కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు. తమ నిర్ణయానికి కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లను కాంగ్రెస్ కు కేటాయించింది డీఎంకే. గతంలో మాదిరి ఈసారి అన్నే సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకు డీఎంకే అధినేత స్టాలిన్ ససేమిరా అంటున్నారు. దీనికి ఆయన చెబుతున్న మాట కూడా సబబుగానే ఉంది. గత ఎన్నికల్లో 41 స్థానాల్ని కేటాయిస్తే కేవలం ఎనిమిది సీట్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ కు ఈసారి 18 సీట్లు మాత్రమే ఇస్తానని డీఎంకే స్పష్టం చేస్తోంది. వాస్తవానికి 2016లో కాంగ్రెస్ కు 41 సీట్లు కేటాయించటం వల్లే తాము అధికారాన్ని కోల్పోయామన్న గుర్రుగా ఉంది.

అందుకే ఈసారి మిత్రుడు గెలిచే అవకాశం ఉన్న స్థానాల్ని గుర్తించి.. అంతవరకే పరిమితం చేయాలని.. మిగిలిన స్థానాల్ని తాము పోటీ చేసి సొంతం చేసుకోవాలని స్టాలిన్ భావిస్తున్నారు. తాజాగా ఐ ఫ్యాక్ అన్న సంస్థతో సర్వే చేయించిన స్టాలిన్.. కాంగ్రెస్ ఎక్కువచోట్ల గెలిచే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తించారు. అందుకే.. సీట్ల కేటాయింపులో గతానికి భిన్నంగా గట్టిగా ఉన్నారు. తమిళ కాంగ్రెస్ నేతల వాదన వేరుగా ఉంది. గతంతో పోలిస్తే తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే.. పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని భావిస్తున్నారు. దీంతో.. రెండుపార్టీల మధ్య సయోధ్యకు రాని పరిస్థితి. దీంతో.. డీఎంకేతో కటీఫ్ చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.

కరుణానిధి హయాం నుంచి తమ పార్టీతో ఉన్న అనుబంధాన్ని డీఎంకే తాజాగా పట్టించుకోవటం లేదని వేదన చెందుతుున్నారు. సీట్ల చర్చల్లో పాల్గొనేందుకు కేరళ మాజీ సీఎం.. కాంగ్రెస్ కురువృద్ధుడు ఉమన్‌చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోకపోవటాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం మలివిడత చర్చలకురమ్మని కూడా డీఎంకే నుంచి ఆహ్వానం రాలేదని వాపోతున్నారు. అందుకే డీఎంకేను వీడి.. కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యంతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలన్న సలహాను ఇస్తున్నారు. అంతిమంగా రాహుల్ తీసుకునే నిర్ణయానికి వదిలిపెడతామని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఢిల్లీకి వెళ్లారు. డీఎంకేతో కొనసాగటం తమిళ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరు. కమల్ హాసన్ తో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే.. వీరంతా మిస్ అవుతున్న పాయింట్.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో డీఎంకే కచ్ఛితంగా విజయం సాధించి.. అధికారాన్ని చేపట్టనుంది. అలాంటివేళ.. మిత్రుడ్ని వదిలేయటం ద్వారా కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుంది. అన్నింటికి మించి తమ బలాన్ని అతిగా ఊహించుకునే కన్నా.. డీఎంకేతో కలిసి సాగటం ద్వారా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున ఎంపీ సీట్లను కూటమి ఖాతాలో పడతాయన్నది మర్చిపోకూడదు. మరి.. రాహుల్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.