షాకింగ్ వ్యాఖ్యలు చేసిన డీఎల్.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి ఖాయమట

Fri Oct 15 2021 20:18:34 GMT+0530 (IST)

DL Ravindrareddy made shocking comments

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీనుడిగా.. అపార రాజకీయ అనుభవం ఉన్న నేతగా.. డక్కామొక్కీలు ఎన్నో తినటంతో పాటు.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. పండుగ రోజున హాలీడే మత్తు వదిలేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. వైసీపీ నేతగా వ్యవహరిస్తున్న ఆయన.. సొంత పార్టీ ప్రభుత్వం మీదనే ఘాటు విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని.. అయితే ఏ పార్టీలో చేరతానో తాను ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వ పని తీరు మీద ఆయన ఘాటు విమర్శలు చేయటమే కాదు.. ఊహించని రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.ఆయన మాటల్ని చూస్తే.. త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో మైదకూరులో వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి విజయంలో కీలకభూమిక పోషించిన ఆయన.. గడిచిన రెండేళ్లుగా నోరు విప్పకుండా మౌనంగా ఉన్నారు. అలాంటి ఆయన ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడటం విశేషం. అంతేకాదు.. మంత్రులు తమ శాఖల పని తీరు మీద మాట్లాడటం లేదన్న ఆయన.. ప్రభుత్వ సలహాదారుగా.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డిని టార్గెట్ చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ మీదా పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయనేం అన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

- 2024 ఎన్నికల్లో కచ్ఛితంగా పోటీ చేస్తా. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేను. ప్రతిభ ఆధారంగానే పార్టీ టికెట్ వస్తుంది. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారు.

- రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చింది. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. రైతుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
రైతుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది.

- పొలం కౌలుకు తీసుకునే వారే లేరు. నా సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామన్నా ఎవరూ ముందుకు రావటం లేదు. సొంత ఖజానా నింపుకోవటమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారు.

- తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు పోతారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకుల్ని మీడియా ప్రశ్నించాలి. ప్రశ్నించకుంటే అధోగతి పాలవుతుంది. భూములు ఆక్రమించుకోవటం.. ఖజానా నింపుకోవటమే పాలకుల పని. ప్రభుత్వం ఇచ్చే రూ.500 రూ.వెయ్యికి ఆశపడి ఎవరూ బతకొద్దు. సొంతంగా సంపాదించటం నేర్చుకోండి.

- రాష్ట్ర పరిస్థితి.. భావితరాల గురించి ఎవరూ ఆలోచించటం లేదు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారు. సబ్సిడీని నేరుగా లబ్థిదారులకు అందించాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించటం లేదు.

- రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టటం లేదు. దారిన పోయే వారంతా మీడియా సమావేశాలు పెడుతున్నారు.