Begin typing your search above and press return to search.

రాజధాని తరలింపులో మరో ముందడుగు: రెండ్రోజులుగా విశాఖలోనే డీజీపీ

By:  Tupaki Desk   |   5 July 2020 7:23 AM GMT
రాజధాని తరలింపులో మరో ముందడుగు: రెండ్రోజులుగా విశాఖలోనే డీజీపీ
X
అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో విశాఖపట్నం ప్రధాన రాజధానిగా మారనుంది. పరిపాలన రాజధానిగా ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సచివాలయం కోసం అనువైన భవనాలను గుర్తించే పనులను ప్రభుత్వం ముమ్మరం చేయగా ఇప్పుడు పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. అవసరమైన భవన సముదాయాలను కోసం అన్వేషణ మొదలైంది.

వీటికోసం డీజీపీ గౌతం సవాంగ్ రంగంలోకి దిగారు. సచివాలయం.. ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడ ఉంటే అక్కడ పోలీసు కార్యాలయం ఉండాలి. ఈ నేపథ్యంలోనే పోలీసు కార్యాలయం కూడా విశాఖపట్టణానికి వెళ్లనుంది. అమరావతి నుంచి విశాఖకు తరలించడం ఖాయమనే సంకేతం వస్తోంది. ఈ క్రమంలోనే డీజీపీ గౌతం సవాంగ్ రెండురోజుల పాటు విశాఖపట్నంలో ఉన్నారు. శుక్ర, శనివారాల్లో విశాఖపట్నంలో బిజీబిజీగా గడిపారు.

పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన సముదాయాల విషయమై అన్వేషణ సాగించారు. పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. పలుచోట్ల పర్యటించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం శివార్లలోని రుషికొండ, ఆనందపురం, పెందుర్తి సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొట్లకొండ, మధురవాడ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల వివరాలు తెలుసుకున్నారు. ఆయా ఖాళీ ప్రదేశాల్లో పోలీసు కార్యాలయాలను నిర్మించడానికి అవసరమైన, అనువైన పరిస్థితులను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రుషికొండ ఐటీ సెజ్‌ను సందర్శించారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణమవుతున్న ఐటీ టవర్-1, 2 పనులను పరిశీలించారు. పనులు ఎప్పట్లో పూర్తవుతాయో తెలుసుకున్నారు. తొట్లకొండలోని గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని పరిశీలించారు.

సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల సమీపంలో ఉన్న సింహపురి కాలనీని కూడా సందర్శించారు. ఈ ప్రాంతంలో భూములు ఖాళీగా ఉన్నాయని జీవీఎంసీ అధికారులు వివరించారు. ఆనందపురం మండలంలో గ్రేహౌండ్స్ విభాగానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్నీ కూడా డీజీపీ పరిశీలించారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయాన్ని ఆనందపురంలో నిర్మించడానికి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ డీజీపీ విశాఖపట్నంలో పర్యటించే అవకాశం ఉంది. సచివాలయం.. ముఖ్యమంత్రి కార్యాలయాలకు స్థలాలు గుర్తించిన అనంతరం దీనిపై ఓ స్పష్టత రానుందని సమాచారం.