Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు డిజిపి పెద్ద షాక్

By:  Tupaki Desk   |   29 Sep 2020 7:30 AM GMT
చంద్రబాబుకు డిజిపి పెద్ద షాక్
X
చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో సస్పెన్షన్ లో ఉన్న జస్టిస్ రామకృష్ణ సోదరుడిపై దాడి ఘటనలో తాజాగా డిజిపి గౌతమ్ సవాంగ్ రాసిన లేఖతో చంద్రబాబునాయుడుకు షాక్ తగిలింది. రామకృష్ణ సోదరుడు రామచంద్రపై రెండు రోజుల క్రితం దాడి జరిగింది. ఎప్పుడైతే దాడి విషయం వెలుగు చూసిందో వెంటనే చంద్రబాబు, లోకేష్ తో పాటు యావత్ టిడిపి నేతలు ప్రభుత్వంపై మండిపోయారు. ఉద్దేశ్యపూర్వకంగానే రామచంద్రపై వైసిపి గుండాలు దాడులు చేసినట్లు ట్విటర్లోను, టిడిపి నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో కూడా చంద్రబాబు ఆరోపణలు చేశారు.

దాంతో ఘటన విషయంలో రాజకీయంగా వేడి రాజుకుంది. దీనికి తోడు ఘటన ను వివరిస్తు చంద్రబాబు డిజిపి కి లేఖ రాశారు. వైసిపి గుండాలను వెంటనే అరెస్టు చేయాలని, ప్రభుత్వమే ఉద్దేశ్య పూర్వకం గా ఎస్సీల పై పథకం ప్రకారం దాడులు చేయిస్తోందంటూ చేసేశారు. ఘటన జరగ్గానే పోలీసులు రంగంలొకి దిగి దర్యాప్తు మొదలుపెట్టేశారు. తమ దర్యాప్తులో వెల్లడయిన వాస్తవాలతో పోలీసులు ముందు ఆశ్చర్య పోయారు. తర్వాత వాస్తవాలు ఇది అంటూ వివరిస్తు చంద్రబాబుకు డిజిపి తాజాగా లేఖ రాశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే మదలపల్లిలో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి టిడిపి కార్యకర్త. ఈయన మార్కెట్లో వెళుతుంటే ఎదురుగా తోపుడుబండి అడ్డొచ్చింది. బండిని తీయమని చెప్పిన క్రమంలో ఇద్దరికి గొడవ జరిగింది. ఇంతలో అదే దారిలో వెళుతున్న రామచంద్ర కూడా అక్కడికి చేరుకున్నారు. అవసరం లేకపోయినా వివాదంలో జోక్యం చేసుకుని తోపుడుబండి వ్యాపారికి మద్దుతుగా నిలిచారు. దాంతో రామచంద్రకు ప్రతాప్ రెడ్డికి మద్య గొడవ పెద్దదయిపోయింది. దాంతో ప్రతాపరెడ్డే ఇనుపరాడ్ తో రామచంద్ర తలపై బలంగా కొట్టారు. గొడవజరిగిన సమయంలో రామచంద్ర ఫుల్లుగా మద్యం సేవించటంతోనే గొడవలో తలదూర్చినట్లు పోలీసులకు అర్ధమైంది.

ఈ విషయాన్ని ప్రతాప్ రెడ్డే పోలీసుల దగ్గర అంగీకరించారు. దాంతో గొడవ ఎందుకు జరిగింది, ఎవరిమధ్య జరిగిందనే విషయాలన్నీ బయటకు వచ్చాయి. అంటే రామచంద్రపై దాడి చేసింది టిడిపి కార్యకర్త ప్రతాప్ రెడ్డే అన్న విషయం బయటపడిందిద. ఇదే విషయాన్ని డిజిపి చంద్రబాబుకు లేఖలో స్పష్టం చేశారు. మరి వాస్తవం ఇదైతే రెండు రోజులుగా చంద్రబాబు, చినబాబు అండ్ కో ప్రభుత్వం మీద బురద చల్లేయటం ఏమిటి ? రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా దాన్ని వెంటనే ప్రభుత్వానికి ఆపాదించేసి జగన్ పై బురద చల్లేయాలని అనుకుంటే ఇలాంటి షాకులే తగులుతాయన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి.