ఇద్దరు కొడుకుల మధ్య డీఎస్ నలిగిపోతున్నాడా?

Thu Jun 28 2018 11:08:01 GMT+0530 (IST)

ప్రభుత్వ సలహాదారు - రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పై ఎంపీ కవితతో సహా నిజామాబాద్ జిల్లా టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు - పార్టీ నేతలు ధ్వజమెత్తారు. కుమారుని రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆయనపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుకు లేఖరాశారు. సీనియర్ నాయకుడిగా ధర్మపురి శ్రీనివాస్ పార్టీలో చేరుతామని కోరినవెంటనే అధినేత కేసీఆర్ ఆయనకు సముచిత గౌరవాన్నిస్తూ ప్రభుత్వ సలహాదారుగా - ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారని.. డీఎస్ మాత్రం తన కుటుంబ వ్యవహారంతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు కేసీఆర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్ కలత చెందారని తనదారి తాను చూసుకుంటున్నారని సమాచారం.స్వతహాగా కాంగ్రెస్ వాది అయిన సీనియర్ నేత - రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.  ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేస్తూనే రెండుసార్లు పీసీసీ పగ్గాలు చేపట్టిన రాజకీయ దురందరుడిగా పేరుగాంచారు. రాష్ట్ర ఏర్పాటనంతరం కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గడం - ఆయనా ఓడిపోవడంతో డీఎస్ ప్రతిష్ట మసకబారింది. ఈ క్రమంలో 2014 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేశారు. ఆ నిర్ణయం వెనుక తన కుమారుడు మాజీ మేయర్ రాజకీయ భవితవ్యం దాగి ఉన్నట్టు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఆ సంగతి ఎలా ఉన్నా - పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే అంతర్రాష్ట్ర సలహాదారునిగా డీఎస్ ను నియమించారు. అనంతరం రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా - ఆ తర్వాత సీఎం కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తనతో పాటు పార్టీలో చేరిన వారికి ఎక్కడా ప్రాధాన్యత లేకపోవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల టీఆర్ ఎస్ ప్లీనరీలోనూ డి.శ్రీనివాస్ ను వేదికపై ఆహ్వానించకపోవడంపై సర్వత్రా చర్చ జరిగింది. ఆ తదుపరి జిల్లాలో ముఖ్య అనుచరులు - తన సామాజిక తరగతికి చెందిన నాయకులతో సమావేశమై చర్చించారు. తనవెంట టీఆర్ ఎస్ లో చేరిన వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకే సమావేశం నిర్వహించానని ఓ సందర్భంలో డీఎస్ మీడియాకు చెప్పారు. అయితే పార్టీ మారేందుకే ఆయన అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ నేతలతో తనకు గల సన్నిహిత్యం దృష్ట్యా ఇటీవల ఢిల్లీలో మంతనాలు సాగించినట్టు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతగానే గుర్తింపు ఇస్తామని ఢిల్లీ నుంచి సంకేతాలు అందడంతో పాటు కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా హస్తం గూటికే చేరేందుకు డీఎస్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు సంజయ్ మాటకే డీఎస్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.  అయితే ఇదే సమయంలో ఇంకో తనయుడు అరవింద్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. బీజేపీలో చేరేలా డీఎస్ రెండో కుమారుడు అరవింద్ నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక బీజేపీ అధిష్టానం పెద్దలు సైతం డీఎస్ ను పార్టీలోకి ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు అప్పగించాలని చూస్తున్నట్టు సమాచారం. దాంతో అక్కడి సీనియర్ - కాపు సామాజిక తరగతి నేతలను తమ వైపు తిప్పు కోవచ్చనే అభిప్రాయంతో కమలనాథులు ఉన్నట్టు తెలిసింది. స్థూలంగా పార్టీ నేతల ఒత్తిడితో డీఎస్ డైలమాలో పడ్డారని సమాచారం.