Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి పై పార్టీలో ఎందుకీ వ్యతిరేకత.?

By:  Tupaki Desk   |   8 Nov 2019 2:30 PM GMT
రేవంత్ రెడ్డి పై పార్టీలో ఎందుకీ వ్యతిరేకత.?
X
ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం దూత గులాం నబీ ఆజాద్ ముందే కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగడం.. రచ్చ చేయడం.. సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడడం తెలిసిందే.. కాంగ్రెస్ సీనియర్లు వీ హనుమంతరావు, షబ్బీర్ అలీల మధ్య సాగిన రచ్చే రద్దుకు కారణం అనుకున్నారంతా.. కానీ అంతుకుమించిన వ్యవహారం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసిందే. రేవంత్ రెడ్డి కి పీసీసీ పీఠం కట్ట బెట్టేందుకు ఢిల్లీ పెద్దలు వేసిన అడుగులే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది.

హుజూర్ నగర్ ఓటమి, కాంగ్రెస్ ఢీలా పడడం.. వచ్చే మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ లో పార్టీని పటిష్టం చేసేందుకు ఢిల్లీ నుంచి గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ వచ్చారు. హుజూర్ నగర్ లో ఓటమి తర్వాత పీసీసీ పీఠం నుంచి ఉత్తమ్ ను తప్పించడం ఖాయమన్న అంచనాలు వచ్చేశాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు లేదా కాంగ్రెస్ సీనియర్ల కే ఈ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ దిగ్గజాలంతా డిసైడ్ అయ్యారు. రేసులో కోమటి రెడ్డి, జానా రెడ్డి, వీ హెచ్ లున్నారు. ఈ ముగ్గురిని తోసిరాజని కాంగ్రెస్ హై కమాండ్ తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ చేయడానికి రెడీ అయ్యినట్టు వార్తలొచ్చాయి.. ఆ కోపమే మొన్నటి సభలో లొల్లికి దారితీసినట్టు సమాచారం.

ఈ వార్త తెలియడంతో పక్క పార్టీలోని వచ్చిన వారికి అగ్రతాంబులం ఇచ్చి పార్టీలో ఇన్నేళ్లు ఉన్న తనకు అన్యాయం చేస్తారా అని వీ హెచ్ మాట్లాడడం వివాదానికి ఆజ్యం పోసిందట.. ఇక రేవంత్ కు పీసీసీ పీఠం ఇస్తే కాంగ్రెస్ ను వీడుతానని కోమటి రెడ్డి సైతం పరోక్ష సంకేతాలు పంపారట.. ఇక సీనియర్ జానా కూడా రేవంత్ ను వ్యతిరేకించినట్టు తెలిసింది. ఉత్తమ్ వద్దే వద్దని చెప్పినట్టు సమాచారం.

ఇలా రేవంత్ రెడ్డి ని అందరూ వ్యతిరేకించేసరికి ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ దూత గులాంనబీ పలాయనం చిత్తగించారు. అయితే తెలంగాణ లో పార్టీ బతికి బట్టాకట్టాలంటే రేవంత్ లాంటి వ్యక్తే సమర్థుడని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ గ్రూపు తగాదాలను పరిష్కరించి పీసీసీ పీఠం మార్చేందుకు సమాయత్తమవుతోంది. మరి ఈ లొల్లిలో సాధ్యమవుతుందా లేదా అన్నది వేచిచూడాలి